బళ్లారి అర్బన్: జిల్లాలోని కురుగోడు తాలూకాలో పురాతనమైన, చారిత్రాత్మక దొడ్డ బసవేశ్వర స్వామి మహారథోత్సవం శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు భక్తుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. కోరిన వారి కోర్కెలు తీర్చే కొంగుబంగారం దొడ్డ బసవేశ్వర స్వామి అన్న ప్రగాఢ నమ్మకం మేరకు ఆనవాయితీగా భక్తులు దర్శించుకుంటున్నారు. ఆలయంలోని దొడ్డబసవేశ్వర స్వామి 14 అడుగుల ఎత్తైన నంది విగ్రహానికి అభిషేకం, అలంకరణ, ధార్మిక పూజలను నిర్వహించారు. 60 అడుగుల ఎత్తైన రాజగోపురానికి ఉత్తరం వైపు ఉన్న మరో గోపురానికి విద్యుత్ అలంకరణలతో ఆకట్టుకొనేలా ఏర్పాట్లు చేశారు. కురుగోడు చుట్టు పక్కల 30 గ్రామాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లాతో పాటు రాష్ట్రంలోని భక్తాదులు బసవేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మహారథాన్ని ఆలయం వద్ద నుంచి బళ్లారి రోడ్డు వైపు ఎదురు బసవణ్ణ వరకు భక్తులు లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. మహారథోత్సవంలో కంప్లి ఎమ్మెల్యే గణేష్, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ జాతర మహోత్సవంతో వారం రోజుల పాటు కురుగోడు పట్టణంలో భక్తుల సందడి నెలకొంటుంది.
నేత్రపర్వం.. దొడ్డబసవేశ్వర రథోత్సవం


