గుర్రంకొండ: గుప్తనిధుల ముఠా సభ్యుల్ని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్దనున్న పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ దిలీప్‌కుమార్ వివరాలు వెల్లడించారు. గుర్రంకొండ పరిధిలోని ఎల్లుట్ల గ్రామం ఇ.పసలవాండ్లపల్లెకు చెందిన మాలేటి శ్రీనివాసులు (44) మదనపల్లెలో నివాసముంటున్నాడు. అక్కడే ఇంటి నిర్మాణ పనుల్లో బేల్దారీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను మదనపల్లెకు చెందిన రచ్చా రవివర్మ (54)తో తమ ప్రాంతంలోని పురాతన ఆలయాలు, కొండల్లో గుప్తనిధుల ఉన్నాయని చెప్పాడు. ఎల్లుట్ల–నగరి పరిధిలో ఉన్న మూలలమ్మకొండల్లో పురాతన ఆలయాల దగ్గర గుప్తనిధులు ఉంటాయని, వాటిని తవ్వితీస్తే ఎంతో విలువైన సంపద బయటపడుతుందన్నారు. వీరిద్దరూ కలసి శ్రీసత్యసాయి జిల్లా తనకల్లుకు చెందిన సింకి భాస్కర్ (43), కోలారు జిల్లా శ్రీనివాసపురానికి చెందిన మూరెళ్ల నాగరాజ (56), మదనపల్లెవాసి అంబటి రెడ్డిసునీల్ (39), వాల్మీకిపురం వాసి ఇడగొట్టి రెడ్డెప్ప (39), బి.కొత్తకోటకు చెందిన వెన్నముద్దల మహేంద్ర (39) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 10వ తేదీన అందరూ నగరి సమీపంలోని మూలాలమ్మ కొండపైకి చేరుకొన్నారు. రాత్రిళ్లు అక్కడే మకాం వేసి ఏవేవో పూజలు నిర్వహించి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. 12న కొండపై నుంచి దిగి వస్తుండగా.. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. తవ్వకాలకు వినియోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.