
ఎస్‌ఐ పోస్టులకు
శివాజీనగర: రాష్ట్రంలో గత బీజేపీ హయాంలో సంచలనం సృష్టించిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) నియామక పరీక్షల్లో చోటు చేసుకున్న కుంభకోణంపై నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ మళ్లీ పరీక్ష నిర్వహించాలని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. నాటి బీజేపీ ప్రభుత్వం 545 పీఎస్‌ఐ పోస్టులకు సంబంధించి నిర్వహించిన పరీక్షల్లో భారీ కుంభకోణం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. దీంతో స్వతంత్ర ఏజెన్సీ ద్వారా ఎస్‌ఐ పోస్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి దినేశ్‌కుమార్ నేతృత్వపు డివిజనల్ బెంచ్ తీర్పు నిచ్చింది. కోర్టు నిర్ణయం గతంలో పరీక్ష రాసి పాసైన అభ్యర్థుల్లో తీవ్ర నిరాశకు గురిచేసింది.
క్యాట్‌లో పిటిషన్ :
నియామక అక్రమాల నేపథ్యంలో పీఎస్‌ఐ పరీక్ష కొత్తగా జరిపేందుకు ప్రభుత్వం 2022 ఏప్రిల్ 29న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు రద్దు కోరుతూ ఎంపికైన కొందరు అభ్యర్థులు క్యాట్‌లో పిటిషన్ వేశారు. దానిని జూన్ 19న క్యాట్ డిస్మిస్ చేసింది. దీనిని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. శుక్రవారం తీర్పును న్యాయస్థానం ప్రకటించి పునః పరీక్షకు ఆదేశించింది.
కేసు వివరాలు ఏమిటి?
గత బీజేపీ ప్రభుత్వ కాలావధిలో 545 పీఎస్‌ఐ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఈ మేరకు అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ అమృత్‌పాల్‌తో పాటుగా 60 మందికిపైగా అరెస్టయ్యారు. పరీక్షల్లో అక్రమాల వెనుక ఆర్‌డీ పాటిల్, దివ్యా హాగరగితో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.
హైకోర్టు ఆదేశం
స్వతంత్ర ఏజెన్సీ ద్వారా పరీక్ష
గత బీజేపీ హయాంలో భారీ కుంభకోణం
కమిషన్ నియామకం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పీఎస్‌ఐ నియామక అక్రమాలకు సంబంధించి విచారణ జరిపేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి వీరప్ప నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ విచారణలో ప్రగతి సాధించింది. ఇప్పటికే 22 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కేసులో 120 మంది నిందితులతో పాటుగా తనిఖీ అధికారులకు నోటీసులు జారీచేసి కమిషన్ విచారణ చేపట్టింది.