శివమొగ్గలో ర్యాపిడ్ యాక్షన్ బలగాల పహారా
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా బలగాలను మోహరించారు. రాగిగుడ్డ ప్రాంతంలో ఈద్ మిలాద్ ఊరేగింపు జరుగుతుండగా మొదట రభస చెలరేగింది. ఒకవర్గం వారి ఇళ్లు, వాహనాలు లక్ష్యంగా కొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో శివమొగ్గ నగరం మొత్తం నిషేధాజ్ఞల్ని అమలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్. సెల్వమణి ప్రకటించారు.
రాగిగుడ్డ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం నిర్వహించి ఈద్ మిలాద్ ఊరేగింపులో కొందరు గొడవకు దిగారు. పోలీసులు అడ్డుకోవడానికి వెళ్ళిన సమయంలో రాళ్లు విసరడంతో లాఠీచార్జ్ చేసి అదుపు చేశారన్నారు. అంతటా 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. మళ్లీ ఆదేశాలను జారిచేసేంత వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని జిల్లాధికారి చెప్పారు. నగరమంతటా కట్టుదిట్టమైన భద్రత ఉందని, ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అలాగే గుంపులుగా చేరరాదని, ఐదు మంది కంటే ఎక్కువగా గుమిగూడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టరాదని, కట్టెలు, కత్తులు వంటి మారణాయుధాలతో సంచరిస్తే వారికే ఇబ్బందులు వస్తాయని తెలిపారు.
చట్ట వ్యతిరేక పనులను సహించం: సీఎం
ధార్మిక కార్యక్రమానికి ఇబ్బందులు కలిగించేలా రాళ్ళు విసరడం, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం లాంటి పనులను మా ప్రభుత్వం అసలు సహించదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. శివమొగ్గలో గొడవలపై ఆయన
సోమవారం బెంగళూరులో విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. రాగిగుడ్డలో ఈద్ మిలాద్ ఊరేగింపులో కొన్ని అసాంఘిక శక్తులు పాల్గొని రభస సృష్టించాయి, కొంతమంది దుండగులు పోలీసుల పైన రాళ్లను విసిరారు, దాంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు లాఠీల ద్వారా వారికి బుద్ధి చెప్పారని సీఎం అన్నారు. గొడవలకు కారణమైన సుమారు 43 మందిని పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారన్నారు. పరిస్థితి అదుపులో ఉందని, భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతలను కాపాడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
కర్ణాటక మరో బిహార్ అవుతుంది: అశోక్
యశవంతపుర: కర్ణాటక మరో బిహార్ కాబోతుందని బీజేపీ మాజీ మంత్రి ఆర్.అశోక్ అరోపించారు. ఆయన సోమవారం బెంగళూరులో విలేకర్లలతో మాట్లాడారు. శివమొగ్గలో జరిగిన ఘర్షణలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రౌడీయిజం ప్రారంభమైంది. ఘర్షణలు, ఇళ్లలోకి దూరి కొట్టడం జరుగుతోందని అన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో గతంలో టిప్పు జయంతిని అచరించి ఘర్షణలకు దారి తీసిందన్నారు. గొడవలు జరిగేలా ప్రభుత్వమే కుట్రకు పాల్పడుతుందన్నారు. అల్లర్లకు పాల్పడుతున్న వ్యక్తులపై కేసులు పెట్టకుండా, ఉన్న కేసులను వాపసు తీసుకొంటోందని ధ్వజమెత్తారు.
ఈద్ ఊరేగింపులో రాళ్ల దాడి
లాఠీచార్జీ చేసిన పోలీసులు
నగరమంతటా 144 నిషేధాజ్ఞలు: కలెక్టర్
నగరమంతటా భారీ బందోబస్తు ఏర్పాటు


