పంటనష్టంపై కలెక్టర్ సమీక్ష

దొడ్డబళ్లాపురం: బెంగళూరు గ్రామీణ జిల్లాలో ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకూ కురిసిన అకాల వర్షాలకు 30 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు కలెక్టర్ ఆర్.లత తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన ఆమె వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు. దొడ్డ తాలూకాలో 1.31 హెక్టార్లు, హొసకోటలో 5.62హెక్టార్ల విస్తీర్ణంలో స్వీట్ కార్న్ పంటకు నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మామిడి 11.70, టమోటా 2, చామంతి 5, బెండకాయి 1.2, బీరకాయి 1.28, బీన్స్ 1 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. దొడ్డ తాలూకాలో ఒక ఇల్లు,ఒక స్కూలుపాక్షికంగా దెబ్బతిన్నాయి.
విద్యుత్ సౌకర్యాలకు నష్టం
ఈదురుగాలుల వల్ల నెలమంగల తాలూకాలో 41 విద్యుత్ స్తంభాలు, 32 ట్రాన్స్‌ఫార్మర్లు, దొడ్డ తాలూకాలో 22 విద్యుత్ స్తంభాలు, 26 ట్రాన్స్‌ఫార్మర్లు, హొసకోటలో 27 విద్యుత్ స్తంభాలు, 3 ట్రాన్స్‌ఫార్మర్‌లు, దేవనహళ్లిలో 25 విద్యుత్ స్తంభాలు, 2 ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతిన్నట్టు బెస్కాం అధికారులు సమాచారం ఇచ్చారు.