అతి పిన్న వయస్సులో మేయర్‌గా ఎన్నికై త్రివేణి సూరి

23-year-old Triveni is Mayor of Ballari - Sakshi

సాక్షి,బళ్లారి: బళ్లారి నగర మేయర్‌ ఎన్నిక ఉత్కంఠభరితంగా ముగిసింది. బుధవారం సిటీ కార్పొరేషన్‌ కార్యాలయంలో నగర మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నిక జరిగింది. రెండో అవధి కింద నగర మేయర్‌ స్థానం ఎస్సీ జనరల్‌కు, ఉపమేయర్‌ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్‌ కావడంతో మేయర్‌ స్థానం కోసం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు పోటీ పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 4వ కార్పొరేటర్‌ త్రివేణి సూరి, 7వ కార్పొరేటర్‌ ఉమాదేవి శివరాజ్‌, 35వ వార్డు కార్పొరేటర్‌ కుబేరాతో పాటు బీజేపీకి చెందిన 16వ వార్డు కార్పొరేటర్‌ నాగరత్న ప్రసాద్‌లు మేయర్‌ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ చెందిన ముగ్గురిలో హైకమాండ్‌, స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర 4వార్డు కార్పొరేటర్‌ త్రివేణి ఎంపికకు కార్పొరేటర్లతో కలిసి మద్దతు సూచించడంతో పార్టీ సూచన మేరకు పోటీలో నిలిచిన కుబేరా, ఉమాదేవిలు ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

బీజేపీ తరఫున బరిలో నాగరత్న ప్రసాద్‌
ఇక మేయర్‌ స్థానానికి కాంగ్రెస్‌ తరపున త్రివేణి సూరి, బీజేపీ తరపున నాగరత్న ప్రసాద్‌ పోటీలో ఉండగా ఎన్నికల అధికారి, నగర కమిషనర్‌, అధికారులు ఎన్నికను నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి త్రివేణి సూరికి సిటీ కార్పొరేషన్‌లోని 39 వార్డులకు గాను 21 మంది కాంగ్రెస్‌, 5 మంది స్వతంత్ర కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ హుస్సేన్‌ల ఓటు హక్కుతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు 28 మంది చేయి ఎత్తి మద్దతు తెలిపారు. ఇక 13 మంది కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్‌, లోక్‌సభ సభ్యుడు దేవేంద్రప్ప ఓటు హక్కుతో బీజేపీ అభ్యర్థినికి 16 మంది మద్దతు దక్కింది. దీంతో మేయర్‌గా కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన కమేలా త్రివేణి సూరి ఎంపికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

ఉపమేయర్‌గా జానకి ఏకగ్రీవం
ఇక ఉపమేయర్‌ స్థానానికి ఒకే ఒకరు 33వ కార్పొరేటర్‌ జానకి నామినేషన్‌ వేసిన నేపథ్యంలో ఆమె ఉపమేయర్‌గా ఏకగ్రీవంగా ఎంపికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్‌ స్థానం కోసం ఉదయం నుంచి ఉత్కంఠత నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు పోటీ చేయడంతో చివరి క్షణం వరకు ముగ్గురు తమకే మేయర్‌ స్థానం కావాలని భీష్మించుకుని కూర్చొన్నారు. అయితే ఎట్టకేలకు కుబేరా, ఉమాదేవిల నామినేషన్‌ ఉపసంహరించుకునే విధంగా నేతలు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. నూతన మేయర్‌, ఉపమేయర్లను ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అధికారులు, కార్పొరేటర్లు అభినందించారు.

చిన్న వయస్సులో మేయర్‌గా ఎన్నికై న త్రివేణి
బళ్లారి నగర మేయర్‌గానే కాకుండా రాష్ట్రంలోని మహానగర పాలికెల్లో ఇప్పటి వరకు అతి పిన్న వయస్సులో మేయర్‌గా ఎన్నికై త్రివేణి సూరి రికార్డు సృష్టించారు. 10వ తరగతి స్థానిక సెయింట్‌ఫిలోమినా స్కూలులో పూర్తి చేసిన అనంతరం పారా మెడికల్‌ కోర్సు పూర్తి చేసిన తర్వాత అనూహ్యంగా తల్లిదండ్రుల సూచనతో 21 ఏళ్లకే 4వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికై న త్రివేణి 23వ ఏట బళ్లారి నగర ప్రథమ పౌరురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో చిన్న వయస్సులో త్రివేణి సూరికి అదృష్టం వరించి మేయర్‌ స్థానం దక్కించుకున్నారు. పలువురు ప్రముఖులు పోటీ చేసినా ఆమెనే మేయర్‌ పదవి వరించింది.

తల్లీకూతుళ్లిద్దరినీ వరించిన మేయర్‌ పదవి
మరో విశేషం ఏమిటంటే నూతన మేయర్‌గా ఎన్నికై న త్రివేణి తల్లి సుశీలబాయి కూడా 2018–19లో నగర మేయర్‌గా పని చేశారు. తల్లీకూతుళ్లిద్దరినీ మేయర్‌ పదవి వరించడం నగరంలో చర్చనీయాంశమైంది. అనంతరం నూతన మేయర్‌ విలేకరులతో మాట్లాడుతూ నగర మేయర్‌ అవుతానని తన కలలో కూడా ఊహించలేదన్నారు. తన తండ్రి ప్రోత్సాహంతో గతంలో తన తల్లి సుశీలాబాయి ఐదేళ్లు కార్పొరేటర్‌గా, ఒక ఏడాదిపాటు నగర మేయర్‌గా సేవ చేసిందని గుర్తు చేశారు. మళ్లీ తండ్రి కమేలా సూరి తనను రాజకీయాల్లోకి రావాలని సూచించడంతో ఉద్యోగానికి వెళ్లకుండా నగర కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందానన్నారు. ప్రస్తుతం మేయర్‌ పట్టం వరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్పొరేటర్లందరి సహకారంతో మేయర్‌గా నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మేయర్‌ తండ్రి సూరి మాట్లాడుతూ గతంలో తన భార్యకు, ప్రస్తుతం తన కుమార్తెకు మేయర్‌ పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top