మాధ్యమాలతోనే అభియాన్‌కు విస్తృత ప్రచారం | Sakshi
Sakshi News home page

మాధ్యమాలతోనే అభియాన్‌కు విస్తృత ప్రచారం

Published Wed, Mar 22 2023 2:04 AM

ప్రణాళికను విడుదల చేస్తున్న వైద్యాధికారులు  - Sakshi

బళ్లారి రూరల్‌ : మాధ్యమాల వల్లే కేంద్ర ఆరోగ్య అభియాన్‌ కార్యక్రమాలకు ప్రచారం లభిస్తోందని జిల్లా ఆరోగ్య విద్యా కేంద్రం ప్రిన్స్‌పాల్‌ డాక్టర్‌ గురునాథ్‌ బి.చౌహాన్‌ తెలిపారు. మంగళవారం డీహెచ్‌ఓ కార్యాలయ సభాంగణంలో జరిగిన కేంద్ర ఆరోగ్య కార్యక్రమాలపై మాధ్యమ ప్రతినిధులకు పరిచయం, జాగృతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య పథకాలపై ప్రచారం వల్లే ప్రజలకు అవగాహన కలుగుతోందన్నారు. జిల్లా క్షయరోగ నిర్మూలనాధికారి డాక్టర్‌ ఇంద్రాణి మాట్లాడుతూ రాష్ట్రంలో క్షయవ్యాధిగ్రస్తుల్లో బళ్లారి జిల్లా మూడో స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 4.50 లక్షల మంది మురికివాడల్లో నివసిస్తున్నారన్నారు. సండూరు బీకేజీ, మైనింగ్‌ కంపెనీ తదితరులు క్షయవ్యాధిగ్రస్తులను దత్తతకు తీసుకొని వారి చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తున్నారన్నారు. జిల్లా ఆర్‌సీహెచ్‌ అధికారి మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోందన్నారు. గర్భిణులకు ఉచిత అంబులెన్స్‌, టీకాలు, పౌష్టికాహారం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా కుటుంబ సంక్షేమ కార్యక్రమ అమలు అధికారి డాక్టర్‌ పూర్ణిమా కట్టెమని మాట్లాడుతూ మనదేశ ప్రజలు ఇద్దరు పిల్లలతో కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలన్నారు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ డాక్టర్‌ బసిరెడ్డి, డీహెచ్‌ఓ డాక్టర్‌ జనార్థన్‌, డాక్టర్‌ మరియంబి, డాక్టర్‌ వీరేంద్రకుమార్‌ వివిధ ఆరోగ్యసూత్రాలను గురించి మాట్లాడారు. కార్యక్రమంలో అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లా ఆరోగ్య విద్యా కేంద్రం ప్రిన్స్‌పాల్‌ డాక్టర్‌ గురునాథ్‌ చౌహాన్‌

Advertisement
Advertisement