వెరిఫికేషన్‌కు అవసరమైన పత్రాలు
కేంద్రం చిరునామా తెలియక బాధితుల తిప్పలు
జిరాక్స్ సౌకర్యం లేక ఇబ్బందులు
కమిషనరేట్ వద్ద ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
అగ్రిగోల్డ్
వెరిఫికేషన్
కరీంనగర్ క్రైం: అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ బాండ్లు, రసీదుల వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారం కరీంనగర్ సిటీ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)లో ప్రారంభమైంది. తెలంగాణ సీఐడీ, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రక్రియకు తొలిరోజు పలువురు బాధితులు హాజరయ్యారు. అయితే వెరిఫికేషన్ కేంద్రం ఎక్కడుందనే సమాచారం స్పష్టంగా లేక కొందరు తొలుత పోలీస్ కమిషనరేట్‌కు చేరుకుని, అక్కడి నుంచి సీటీసీకి వెళ్లాల్సి వచ్చింది. నగరానికి దూరంగా కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు సమీపంలో జిరాక్స్ సౌకర్యం లేకపోవడంతో ముఖ్యంగా వృద్ధులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్‌కు సమీపంలోని పోలీస్ కమిషనరేట్‌లోనే వెరిఫికేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ పని దినాల్లో ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. కరీంనగర్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల బాధితులు తమకు కేటాయించిన మండలాల వారీ తేదీల్లో హాజరుకావాలని అధికారులు సూచించారు. డిపాజిటర్లు ఒరిజినల్ బాండ్లు, రసీదులతో పాటు ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి. బాండ్ల పరిశీలన అనంతరం అసలు పత్రాలను తిరిగి అందజేసి, జిరాక్స్ కాపీలకు అధికారిక రసీదు ఇస్తామని అధికారులు తెలిపారు.
డిపాజిటర్ జీవించి ఉంటే: ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు ఒరిజినల్, బాండ్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్.
డిపాజిటర్ మరణించి నామినీ ఉంటే: బాండ్ క్లెయిమ్, మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ ఆధార్, పాన్ కార్డు జిరాక్స్‌లు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, బాండ్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్.
డిపాజిటర్, నామినీ ఇద్దరూ మరణిస్తే: ఒరిజినల్ బాండ్, చట్టబద్ధ వారసుడి క్లెయిమ్, ఇద్దరి మరణ ధ్రువీకరణ పత్రాలు, వారసుడి ఆధార్, పాన్ కార్డులు, కుటుంబ లేదా రెవెన్యూ శాఖ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
డిపాజిటర్ జీవించి ఉండి రాలేని పరిస్థితుల్లో: అసలు బాండ్, క్లెయిమ్, ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, ఫొటోతో పాటు కేంద్రానికి వచ్చే వ్యక్తి గుర్తింపు, డిపాజిటర్‌తో సంబంధాన్ని తెలిపే పత్రాలు చూపించాలి.
ఏజెంట్ల బాండ్లకు ప్రత్యేకంగా: ప్రతి బాండ్ ఒరిజినల్‌ను పరిశీలనకు చూపించి, క్లెయిమ్, బ్యాంక్ వివరాలు, బాండ్ గుర్తింపు సంఖ్యను విడివిడిగా నమోదు చేయించాలి. ఏజెంట్ ఆధార్, పాన్ కార్డులు, బాండ్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, మొబైల్ నంబర్, ఏజెంట్ కోడ్ సమర్పించాలి.


