రైల్వే జీఎంతో కేంద్రమంత్రి బండి సంజయ్ సమావేశం
జమ్మికుంట, ఉప్పల్ స్టేషన్ల అభివృద్ధికి సానుకూలత
కొండగట్టులో కొత్త స్టేషన్ ఏర్పాటుపై అధ్యయనం
తిరుపతి, శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపాలని విజ్ఞప్తి
కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే అభివృద్ధి పనులపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ దృష్టి సారించారు. బుధవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవతో సమావేశమై పలు ప్రతిపాదనలు చేశారు. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారాల పొడిగింపు, ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. జమ్మికుంటలో రోడ్ అండర్ బ్రిడ్జి, వ్యాగన్ లోడింగ్ సౌకర్యం, ఉప్పల్‌లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొండగట్టులో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని, సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే మార్గాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కోరారు. కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి మూడు, నాలుగు రోజులు రైలు నడపడంతో పాటు శబరిమల యాత్రికుల కోసం వారానికి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జమ్మికుంట, పెద్దపల్లి స్టేషన్లలో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు.


