కరీంనగర్ కార్పొరేషన్: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన అర్హులైన ఓటర్లకు తుది జాబితాలో నమోదయ్యేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని నగరపాలక సంస్థ కమిషనర్, ఈఆర్‌ఓ ప్రఫుల్ దేశాయి తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఎస్‌డీడీ జాబితాలో ఉండి ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులు తిరిగి నమోదు చేసుకోవచ్చన్నారు. బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు ఈ నెల 30 వరకు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, వివరాలు నింపిన వెంటనే స్వీకరిస్తారని తెలిపారు. అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, నకిలీ ఓట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సత్తినేని శ్రీనివాస్, మడుపు మోహన్, నాంపల్లి శ్రీనివాస్, బర్కత్ అలీ, వాసుదేవరెడ్డి, తహసీల్దార్లు రాజేష్, ఆర్.వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


