డ్రగ్స్‌ కట్టడికి కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కట్టడికి కఠిన చర్యలు

Nov 26 2026 12:06 AM | Updated on Nov 26 2026 12:06 AM

● కలెక్టర్‌ చిత్రామిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల తయారీ, సరఫరా, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్స్‌ నియంత్రణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాసంస్థలు, గ్రామాల్లో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని సూచించారు. హాస్టళ్లు, మెడికల్‌, పాన్‌ షాపులు, విద్యాసంస్థల పరిసరాల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గంజాయి కలిపిన చాక్లెట్లు, ఇతర తినుబండారాల పట్ల అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. మత్తుకు బానిసైన వారికి చికిత్స, కౌన్సెలింగ్‌ అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్‌ ఆలం డ్రగ్స్‌ నియంత్రణకు పోలీసుల చర్యలను వివరించారు. గత నెలలో 10 విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 570 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ సీఐ దుర్గాభవాని తెలిపారు.

బ్లాక్‌ స్పాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలో నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్లను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారులపై సైన్‌ బోర్డులు, రేడియం స్టిక్కర్లు, రైలింగ్‌ ఏర్పాటు, రోడ్ల మరమ్మతులు, సరైన లైటింగ్‌ ఉండేలా చూడాలన్నారు. అతివేగం, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ నిర్లక్ష్యం, రాంగ్‌రూట్‌, మద్యం తాగి డ్రైవింగ్‌ ప్రమాదాలకు ప్రధాన కారణాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, పీఎం రహత్‌, పీఎం రహవీర్‌, హిట్‌ అండ్‌ రన్‌ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. సీపీ గౌస్‌ ఆలం పోలీస్‌స్టేషన్ల వారీగా ప్రమాదాల వివరాలను వెల్లడించగా, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ నగరంలో చేపడుతున్న భద్రతా చర్యలను వివరించారు. అనంతరం పీఎం రహత్‌ పథకంపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్‌, సీపీ ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement