వసతులేవీ.. సంక్షేమమేదీ? | - | Sakshi
Sakshi News home page

వసతులేవీ.. సంక్షేమమేదీ?

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

జిల్లాలోని హాస్టళ్లు, విద్యార్థుల వివరాలు

జమ్మికుంటలో నేలపైనే నిద్ర హుజూరాబాద్‌లో 432 మందికి చాలనీ దుప్పట్లు వేడినీటి సౌకర్యం లేదు.. దోమల బెడద అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న హాస్టళ్లు

కరీంనగర్‌: చలికాలం మొదలై ఉష్ణోగ్రతలు పడిపోతున్నా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పడుకునేందుకు మంచాలు లేక నేలపైనే నిద్రించాల్సి వస్తోంది. చలిని తట్టుకునేందుకు సరిపడా దుప్పట్లు, స్నానాలకు వేడినీళ్లు అందుబాటులో లేవు. దోమల బెడదతో రాత్రిళ్లు నిద్రలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్‌ హాస్టళ్లలో పరిస్థితులు విద్యార్థుల సంక్షేమంపై అధికారుల పర్యవేక్షణను ప్రశ్నిస్తున్నాయి.

నేలపైనే నిద్ర.. అద్దె భవనంలో అవస్థలు

జమ్మికుంటలోని బీసీ సంక్షేమ వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరడంతో మూడు నెలలుగా 47 మంది విద్యార్థులను అద్దె భవనంలో ఉంచుతున్నారు. అయితే అక్కడా కనీస వసతులు లేవు. మంచాలు లేక విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు. దుప్పట్లు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పరిశీలన జరిగిన రోజే దుప్పట్లు అందజేయడం గమనార్హం. వేడినీటి సౌకర్యం లేక చన్నీళ్లతోనే స్నానాలు చేస్తున్నారు. దోమల బెడదతో ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు.

432 మందికి సరిపోని వసతులు

హుజూరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే సంక్షేమ వసతి గృహంలో 432 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ హాస్టల్‌ కూడా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. విద్యార్థులందరికీ సరిపడా దుప్పట్లు లేకపోగా, వేడినీటి సౌకర్యం కూడా లేదు. కొత్త దుప్పట్ల కోసం ఇండెంట్‌ పెట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రహరీ గోడ లేకపోవడం, దోమల బెడద విద్యార్థులకు అదనపు సమస్యలుగా మారాయి.

తక్షణమే సౌకర్యాలు కల్పించాలి

చలికాలంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పరిశుభ్రత, దోమల నివారణ, వేడినీరు, అవసరమైన మందులు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి. అధికారులు హాస్టళ్లను తనిఖీ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. చదువుల కోసం ఇంటికి దూరంగా ఉంటున్న పేద విద్యార్థులకు కనీస వసతులు కల్పించడమే నిజమైన సంక్షేమం.

వసతి గృహాలు విద్యార్థినీ,

విద్యార్థులు

బీసీ సంక్షేమ శాఖలో

19(ప్రీమెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌) 1847

ఎస్సీ సంక్షేమ శాఖలో

30(ప్రీమెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌) 2765

ఎస్టీ సంక్షేమ శాఖలో

04 (ప్రీమెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌) 606

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement