కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అధికారులను ఆదేశించారు. గురువారం అక్టోబర్ నెల నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, పండుగల బందోబస్తుపై సమీక్షించారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్, జూదం, పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డయల్ 100/112 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం వివిధ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు. సమావేశంలో ఏసీపీలు, పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


