వెలుగుల కేళీ.. దీపావళి పండుగను ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధం అయ్యారు. లక్ష్మీపూజలు, కేదారేశ్వర నోములకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండుగ సందర్భంగా శనివారం ఉదయం నుంచే మార్కెట్లో సందడి నెలకొంది. ప్రమిదలు, గుమ్మడికాయలు, పూజాసామగ్రి కొనుగోలు చేసేవారితో కిటకిటలాడింది. బంతిపూలు మార్కెట్‌ను మంచెత్తగా కిలోకు రూ.50కి పైగానే పలికాయి. ఇక నగరంలోని అంబేద్కర్ స్టేడియం, మార్క్‌ఫెడ్ మైదానంలో టపాసుల స్టాళ్లు ఏర్పాటు చేయగా.. శనివారం నుంచే కొనుగోళ్లు షురూ అయ్యాయి. గతంలో రూ.300లకు కిలో చొప్పున అమ్మకాలు జరిపిన నిర్వాహకులు ప్రస్తుతం రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయిస్తున్నారు. టపాసుల హోల్‌సేల్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని చెబుతుండగా పండుగ సందర్భంగా తప్పదు కాబట్టి బడ్జెట్లో కొనుగోలు చేస్తున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. దీపావళి సందర్భంగా కరీంనగర్ బస్టాండ్‌లోనూ రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాలకు వెళ్లేవారితో పాటు, పట్నం నుంచి పండక్కి వచ్చేవారితో సందడి నెలకొంది. దీపావళి స్పెషల్ పేరిట పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపిస్తూ.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులు పర్యవేక్షించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


