కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థుల ఈ ఏడాది పరీక్ష ఫీజును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ చెల్లించారు. శనివారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జగిత్యాల జిల్లాల బీజేపీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లకు చెక్కులు అందజేశారు. కరీంనగర్ జిల్లాలో 4,356 మంది విద్యార్థులకు సంబంధించి రూ.5,44,500 విలువైన చెక్కు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,920 మందికి రూ.4,90,000, సిద్దిపేట జిల్లాలో 1,133 మందికి రూ. 1,37,140, జగిత్యాల జిల్లాలో 1,087 మందికి రూ.1,35,875, హనుమకొండ జిల్లాలో 463 మంది విద్యార్థులకు రూ.57,875 విలువైన చెక్కులు అందించారు. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో పార్లమెంట్ పరిధిలోని 10,959 మంది పేద విద్యార్థులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. కరీంనగర్లో చెక్కు అందించిన వారిలో మేయర్ కొలగాని శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూ టీ మేయర్ సునీల్ రావు, బాస సత్యనారాయణ రావు, పార్లమెంట్ కన్వీనర్ బి.ప్రవీణ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.ఆంజనేయులు పాల్గొన్నారు.


