అయోమయం.. ప్రమాదకరం! | - | Sakshi
Sakshi News home page

అయోమయం.. ప్రమాదకరం!

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

ప్రమాదకరంగా ఇరుకుల్ల యూటర్న్‌

వరంగల్‌ హైవేకు ఎలా వెళ్లాలో తెలియక గందరగోళం

ప్రవేశ రోడ్డు సూచికబోర్డులు కరువు

భారీ స్పీడ్‌ బ్రేకర్లతో ప్రమాదాలు

ఇరుకుల్ల వద్ద జాతీయ రహదారిలోకి ప్రవేశించేమార్గంలో ప్రమాదకరంగా ఉన్న స్పీడ్‌బ్రేకర్లు

రాజీవ్‌రహదారి వద్ద యూటర్న్‌

తీసుకుంటున్న డీసీఎం

కరీంనగర్‌ రూరల్‌: రాజీవ్‌ రహదారి నుంచి వరంగల్‌ జాతీయ రహదారిలోకి ప్రవేశించేందుకు దారి తెలియక వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. సూచిక బోర్డులు లేకపోవడంతో గోదావరిఖని నుంచి వచ్చేవారు ఇరుకుల్ల వద్ద జాతీయ రహదారిపైకి ఎలా వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. యూటర్న్‌ ఉన్నప్పటికీ సూచికబోర్డులు లేకపోవడంతో కొందరు ఫ్లైఓవర్‌ పక్కనే ఉన్న సర్వీస్‌ రోడ్డు నుంచి వెళ్లడంతో ఇరుకుల్ల వాగు వరకు వెళ్లి వెనక్కి వస్తున్నారు. మరికొందరు దుర్శేడ్‌ మీదుగా జాతీయ రహదారిపైకి ప్రవేశిస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలతో దుర్శేడ్‌లో ఇరుకుగా ఉన్నరోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రమాదకరంగా యూటర్న్‌

జగిత్యాల– వరంగల్‌ జాతీయ రహదారి 563 డిజైన్‌ లోపంతో వాహనదారులకు శాపంగా మారింది. ఇరుకుల్ల వద్ద వాహనాలు యూటర్న్‌ తీసుకుని జాతీయ రహదారి ఎక్కాలి. నేషనల్‌ హైవే అధికా రులు ఈ ప్రాంతంలో ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. ఇరుకుల్ల గ్రామస్తులు యూటర్న్‌ ద్వారానే కరీంనగర్‌కు రాకపోకలను సాగిస్తున్నారు. గోదావరిఖని నుంచి వచ్చే వాహనాలు అతివేగంగా రావడంతో ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 10మంది గ్రామస్తులు యూటర్న్‌ వద్ద రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. ప్రస్తుతం వరంగల్‌ జాతీయ రహదారిలోకి యూటర్న్‌ ద్వారా వాహనాలు ప్రవేశిస్తుండటంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది.

భారీ స్పీడ్‌ బ్రేకర్లతో ప్రమాదాలు

వరంగల్‌ జాతీయ రహదారిని మొదటిదశలో వరంగల్‌ నుంచి ఇరుకుల్ల వరకు నిర్మించారు. రెండో దశలో ఇరుకుల్ల నుంచి జూబ్లీనగర్‌, నగునూరు, కొత్తపల్లి మీదుగా జగిత్యాల వరకు చేపట్టనున్నారు. జాతీయ రహదారిలోకి ప్రవేశించే, దిగే ప్రాంతాల్లో భారీ స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేశారు. వరంగల్‌ నుంచి వచ్చే వాహనాలు కిందకు దిగే ప్రాంతం స్లోపుగా ఉండటంతో స్పీడ్‌ బ్రేకర్ల మీదుగా వేగంగా వచ్చి అదుపుతప్పి బోల్తా పడుతున్నాయి. ఇటీవల క్రషర్‌లోడ్‌తో వచ్చిన లారీ బోల్తాపడగా సమీపంలో ఉన్న ద్విచక్రవాహనదారులకు తృటిలో ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి నుంచి కిందకు దిగిన వాహనదారులు కరీంనగర్‌, పెద్దపల్లి, గోదావరిఖనికి ఎటు నుంచి వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కరీంనగర్‌కు వెళ్లాలంటే సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మొగ్ధుంపూర్‌ జెడ్పీ పాఠశాల వద్ద యూటర్న్‌ తీసుకోవాల్సి వస్తోంది. కొందరు ఇరుకుల్ల యూటర్న్‌ ద్వారానే కరీంనగర్‌ వెళ్లేందుకు రాంగ్‌రూట్‌లో వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా నేషనల్‌ హైవే అధికారులు స్పందించి రహదారికి ఇరువైపులా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement