కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కార్యాలయంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. శనివారం కార్యాలయంలో ప్రత్యేకంగా దీపాలు, పూలతో అలంకరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు దీపాలు వెలిగించి వేడుకలు ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలు ఆనందోత్సవాలతో పండగను జరుపుకోవాలన్నారు. కార్పొరేటర్లు మాసం గణేశ్, చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, సరిళ్ల రాజకుమారి ప్రసాద్, నగరపాలకసంస్థ అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహియొద్దీన్, సహాయ కమిషనర్ రాజమనోహర్, తేజస్విని, విజయలక్ష్మి, వెంకటేశ్, సునీల్ పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్‌కే ప్రత్యేకంగా నిలిచిన సమాధుల పండుగకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. శనివారం వ్యవసాయ మార్కెట్‌యార్డ్ సమీపంలోని రెండు శ్మశానవాటికలతో పాటు వల్లంపహడ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కార్ఖానగడ్డ, కాశ్మీర్‌గడ్డ, సవరన్‌స్ట్రీట్, ఆదర్శనగర్, కిసాన్‌నగర్, బేడబుడగజంగాలకాలనీ, వల్లంపహడ్, చింతకుంట, కొత్తపల్లి, రేకుర్తి తదతర శ్మశానవాటికల్లో సమాధుల పండుగకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. పారిశుధ్య పనులు, బ్లీచింగ్ చల్లడం, ప్రహరీలకు పెయింటింగ్, తాత్కాలిక ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు, లైటింగ్ సిస్టమ్, తాగునీటి వసతి, వాటర్ ట్యాంకర్లు తదితర సదుపాయాలు కల్పించామన్నారు. కార్పొరేటర్లు కొంపెల్లి శ్వేత రమణ్, బొట్ల శ్యామల కిరణ్, సాదినేని లావణ్య మునీందర్, ఈఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృతమవుతోంది. ఉద్యోగుల ఆందోళన శనివారం 26వ రోజు కొనసాగింది. నెలరోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 26 రోజులుగా సమ్మె కొనసాగుతుండటంతో ఉద్యోగులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, తమ హక్కుల సాధన విషయంలో వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేశారు.
సీఎంఆర్‌పై సాగుతున్న విజిలెన్స్ దర్యాప్తు
కరీంనగర్ అర్బన్: సీఎంఆర్ కేటాయింపు, వసూళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, జిల్లా పౌరసరఫరాల అధికారుల తీరుపై ఫిర్యాదు చేసిన చెంజర్ల గ్రామానికి చెందిన బోళ్ల వేణుగోపాల్ ఇంట్లో శనివారం అధికారులు విచారణ చేపట్టారు. కరీంనగర్‌లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు లోతుగా విచారించారు. అధికారుల అక్రమాలు, బాధ్యతారాహిత్యంపై ఆయన సమర్పించిన ఆధారాలను సేకరించిన విజిలెన్స్ అధికారులు, సంబంధిత పత్రాలను పరిశీలించి తదుపరి చర్యల నిమిత్తం వెనుదిరిగారు.
కరీంనగర్‌క్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డుకు కరీంనగర్ పోలీస్‌శాఖ అండగా నిలిచింది. సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎండీ ముజీబ్ ఈ నెల 2న విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చేయి విరగడంతో పాటు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న సీపీ గౌస్ ఆలం బాధితుడి వైద్య ఖర్చుల నిమిత్తం హోంగార్డు సంక్షేమ నిధి నుంచి రూ.40 వేల సాయాన్ని మంజూరు చేశారు. శనివారం హోంగార్డు ఆర్‌ఐ జానీమియా ఆధ్వర్యంలో ముజీబ్‌కు ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు.


