పత్తి సమాచారం.. అరచేతిలో నిక్షిప్తం | - | Sakshi
Sakshi News home page

పత్తి సమాచారం.. అరచేతిలో నిక్షిప్తం

Nov 7 2026 12:06 AM | Updated on Nov 7 2026 12:06 AM

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లాలో పత్తి ప్రధాన పంటగా 43,878 ఎకరాల్లో సాగైంది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లపరంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సీసీఐ అధికారులు వన్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టం ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో వాట్సాప్‌ యాప్‌ రూపొందించారు. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖకు దీన్ని అనుసంధానించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సీసీఐ కేంద్రాల కొనుగోళ్ల తాజా వివరాలను యాప్‌లో అందుబాటులో ఉంచుతారు. కొనుగోళ్ల తాజా సమాచారం యాప్‌ ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తుంది. జిన్నింగ్‌ మిల్లులో ఎన్ని వాహనాలున్నాయి? తమ సీరియల్‌ ఎప్పుడు వస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

ఏమిటి.. ఎలా..

వాట్సాప్‌ నంబర్‌ 8897281111ను మొబైల్‌లో సేవ్‌ చేసుకోవాలి. వాట్సాప్‌లోకి వెళ్లి రైతులు హెచ్‌ఐ(హాయ్‌) అని టైప్‌ చేస్తే వెంటనే వన్‌ సాఫ్ట్‌ సిస్టమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో అది తెరచుకుంటుంది. ఇందులో ఇంగ్లిషు, తెలుగు, హిందీ భాషల్లో కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు తెలుగు ఎంపిక చేసుకుంటే అర్హత తనిఖీ, విక్రయ సమాచారం, తక్పట్టి వివరాలు, కేంద్రంలో వేచి ఉండే సమయం, ఇలా 4 ఆప్షన్లు కనిపిస్తాయి. రైతులు సాగు చేసిన పత్తి వివరాలు, రైతు ఎన్ని క్వింటాళ్ల వరకు విక్రయించుకునేందుకు అర్హత ఉందనేది మొదట కనిపిస్తుంది. ఒకవేళ రైతులు పత్తి విక్రయిస్తే ఎంతసరకు విక్రయించారు, చెల్లింపు డబ్బుల వివరాలు కనిపిస్తాయని మార్కెటింగ్‌ వర్గాలు తెలిపాయి. వానాకాలం సీజన్లో పత్తి రైతులు, దిగుబడి అంచనా వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేశారు. సదరు సమాచారాన్ని సీసీఐ కేంద్రాలకు అందజేశారు. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న రైతులకే యాప్‌ అందుబాటులో ఉంటుంది. సీరియల్‌లో ఉన్న వాహనాల సంఖ్య, లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ వివరాలు ప్రత్యక్షమవుతాయి. సరుకు విక్రయించిన తర్వాత తక్పట్టి వివరాలు, ధరల వివరాలు, నగదు ఎన్ని రోజుల్లో జమవుతుందో స్టేటస్‌ కూడా తెలుసుకోవచ్చు. ఒకసారి పంట విక్రయించిన రైతులు.. తదుపరి చేతికందే పత్తి అంచనాను సైతం యాప్‌లో పొందుపరచొచ్చు. తద్వారా అధికారులకు కొనుగోళ్లపై ఓ అంచనా ఉంటుంది.

జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం:

3,34,606 ఎకరాలు

పత్తి సాగు విస్తీర్ణం: 43,878ఎకరాలు

దిగుబడి అంచనా: 3.07లక్షల క్వింటాళ్లు

పత్తి మద్దతు ధర(క్వింటాలుకు): మధ్యరకం రూ.8,267, పొడవాటి రకం రూ.8,667

ప్రస్తుతం విపణిలో పత్తి ధర మద్దతుకు మించి ధర పలుకుతోంది.

ఈ క్రమంలో ధర పడిపోతే మద్దతు ధరకు కొనేందుకు సీసీఐ సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలోని హెచ్చు ప్రాంతాల్లో పత్తి తొలితీత పూర్తవగా.. విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. రైతులు తెల్ల బంగారాన్ని విక్రయించాలంటే గతంలో భారత పత్తి సంస్థ(సీసీఐ) కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. రైతు ఎప్పుడు సరుకు తీసుకెళ్లాలనే సమాచారం నుంచి నగదు జమ వరకు సకల వివరాలు తెలుసుకోవచ్చు.

వాట్సాప్‌ నంబర్‌ 8897281111

హాయ్‌ అని మెస్సేజ్‌ చేస్తే సరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement