● పదో తరగతి విద్యార్థిపై నలుగురు తోటి విద్యార్థుల దాడి
● వీపు, ముఖంపై పిడిగుద్దులు
● పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబం
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం బాలుర గురుకుల విద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపింది. పదో తరగతి విద్యార్థిపై అదే తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి స్టడీ అవర్ ముగిశాక విద్యార్థులందరు నిద్రించేందుకు వెళ్లారు. ఈక్రమంలో పదో తరగతి విద్యార్థి పడుకునేందుకు బ్లాంకెట్ కోసం గది వద్దకు వెళ్తుండగా అక్కడకు వచ్చిన తోటి నలుగురు విద్యార్థులు నెక్కరు, షర్టు కిందకు లాగారు. ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించటంతోపాటు దుషించాడు. తమనే దూషిస్తావా అంటూ ఆ నలుగురు టెన్త్ విద్యార్థి వీపు, ముఖంపై పిడుగుద్దులు కురిపించారు. ఈ విషయం ఎవరికై నా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భయపడిన బాధితుడు ఎవరికీ చెప్పలేదు. శుక్రవారం ఉదయం తోటి విద్యార్థులతో స్నానానికి వెళ్లగా వీపుపై ఎర్రగా, కమిలిపోయిన గాయాలు కనిపించాయి. దీనిపై పీఈటీ రాజశేఖర్ ఆరా తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే ప్రిన్సిపాల్ విద్యాసాగర్ దృష్టికి తీసుకెళ్లారు. నిందితులోతపాటు బాధితుడిని పిలిపించి ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి విద్యాలయానికి రావాలని ఆదేశించారు. గాయపడిన విద్యార్థిని సిక్‌రూంకు పంపించి ప్రథమ చికిత్స చేయించారు. గాయపడిన విద్యార్థి అనాథ కావడంతో బాగోగులు చూసుకునే బాబాయి బాలసాని కుమారస్వామి, పిన్ని పుష్పలత గోదావరిఖని నుంచి మధ్యాహ్నం 2 గంటలకు విద్యాలయానికి చేరుకున్నారు. ప్రిన్సిపాల్‌తో మాట్లాడిన అనంతరం నిందితులను ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎంబడి శ్రీకాంత్ విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలోనే నలుగురు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. గాయపడిన విద్యార్థి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.కాగా, గురుకులంలో గతంలోనూ ఇలాంటి ఒకట్రెండు ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. తాజాగా అనాథ బాలుడిపై దాడి వెలుగులోకి రావడంతో ర్యాగింగ్, వేధింపులను ఎలా అరికడతారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
జల్సాలకు అలవాటు పడి.. బైక్ దొంగగా మారి..
పెద్దపల్లిరూరల్: జల్సాలు, ఇతర అవసరాల కోసం సులువుగా డబ్బు సంపాదించాలనుకుని బైక్ దొంగతనాలు చేయాలనుకున్న బైరి నరేశ్.. అందుకు పెద్దపల్లిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రని ఎంచుకున్నాడు. కొన్ని నెలలుగా 8 బైక్‌లు ఎత్తుకెళ్లాడు. శుక్రవారం మంథని ఫ్‌లైఓవర్ వంతెన వద్ద పోలీసులకు చిక్కాడు. ఏసీపీ గజ్జి కృష్ణ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లికి చెందిన బైరినరేశ్ ప్రస్తుతం పెద్దపల్లిలోని హనుమాన్‌నగర్‌లో నివాసముంటున్నాడు. కొంతకాలం బసంత్‌నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేసి అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత తనకు అవసరమైన డబ్బును సులువుగా సంపాదించేందుకు బైక్ దొంగతనాలను ఎంచుకుని జిల్లా ప్రభుత్వాస్పత్రి ముందు పార్కింగ్ చేసిన బైక్‌లను ఆగస్టు నుంచి ఎత్తుకెళుతూ తన ఇంటి పరిసరాల్లో దాచాడు. ఇప్పటివరకు ఎత్తుకెళ్లిన 8 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


