డిసెంబర్‌ వరకు ‘అత్యంత బలమైన ఎల్‌నినో’ | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ వరకు ‘అత్యంత బలమైన ఎల్‌నినో’

Oct 16 2026 7:29 AM | Updated on Oct 16 2026 7:29 AM

● వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రత ● భూమి ఆరోగ్యం, పంటలపై తీవ్ర ప్రభావం ● ‘సాక్షి’తో పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాల జిల్లాలో అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు అత్యంత బలమైన ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడుతాయని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. యాసంగిలో వరి పంటకు బదులు తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు సాగు చేసి, కీలక దశలో నీరు ఇస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎల్‌నినో, పంటల సాగులో సమస్యలపై గురువారం ‘సాక్షి’కి పలు విషయాలు వివరించారు. ఆమె మాటల్లోనే..

పసిఫిక్‌ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల నీరు సాధారణం కంటే వేడెక్కడాన్ని ఎల్‌నినోగా పిలుస్తారు. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గడిచిన 20 ఏళ్లలో 2015, 2023లో తీవ్ర స్థాయిలో, 2009, 2011, 2020, 2021లో మధ్యస్థంగా, 2012, 2013, 2019లో సాధారణ, 2004, 2006, 2014, 2018లో బలహీనమైన స్థాయిలో ఎల్‌నినో తన ప్రభావాన్ని చూపింది. ఎల్‌నినో వల్ల కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాపాతం, మరికొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాపాతం లేకపోవడం వంటివి జరగవచ్చు. సముద్ర ఉపరిత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగి, వేడిగాలులు వీయడంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

● డిసెంబర్‌ వరకు అత్యంత బలమైన ఎల్‌నినో

ఈ ఏడాది జూన్‌లో బలహీన ఎల్‌నినో ఉండగా, జూలైలో మధ్యస్థ ఎల్‌నినోగా తయారైంది. ప్రస్తుతం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఎల్‌నినో అత్యంత బలమైన స్థాయికి చేరుకుంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఎక్కువ నమోదవుతాయి. ఇప్పటికే అక్టోబర్‌ 8, 2026 రోజు సాధారణం కంటే 2.1 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

● మార్చి వరకు తగ్గే అవకాశం

2027 జనవరి నుంచి మార్చి వరకు ఎల్‌నినో స్థాయి క్రమంగా తగ్గే అవకాశం ఉంది. అక్టోబర్‌–డిసెంబర్‌ నెలల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు 2.74 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయి. జనవరి–మార్చి 2027 వరకు 1.90 డిగ్రీలకు తగ్గే అవకాశముంది. తర్వాతి ఎప్పటిమాదిరిగానే ఎండాకాలం ఉష్ణోగ్రతలు ఉంటాయి.

● దిగుబడులు తగ్గుతాయి

అధిక వేడితో మొక్కల నుంచి నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. ఆకులు వాడిపోవడం, ముడుచుకుపోవడం కనిపిస్తుంది. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ తగ్గి మొక్కల పెరుగుదల మందగిస్తుంది. తీవ్రమైన వేడి, నీటికొరత వల్ల ప్రతీ పంటలో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దీనికి తోడు ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల భూమిలోని తేమ వేగంగా తగ్గుతుంది. భూమి పై పొర త్వరగా ఎండిపోతుంది. యాసంగి పంటలు ఎక్కువగా అక్టోబర్‌–మార్చి మధ్య సాగు చేస్తారు. విత్తనం మొలక, పెరుగుదల దశలకు సాధారణ స్థాయి ఉష్ణోగ్రతలు అవసరం. కానీ, జనవరి–మార్చి వరకు ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగితే పంటలపై వేడి, ఒత్తిడి ఏర్పడి, పూత, గింజ దశలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

● పంటల్లో కలిగే మార్పులు

వరి పూత దశలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటే గింజలు ఏర్పడకపోవచ్చు. నీటి అవసరం రెట్టింపు అవుతుంది. దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొక్కజొన్న పుష్పించే సమయంలో తగిన పరాగ సంపర్కం దెబ్బతినే అవకాశం ఉంది. కంకుల్లో గింజలు సరిగా ఏర్పడవు. శనగపంటలో ఉష్ణోగ్రతలు పెరిగితే పంట గింజకు రాకుండానే త్వరగా పరిపక్వతకు వస్తుంది. భూమి పొడిగా ఉంటే వేరుశనగలో కాయలు ఏర్పడటం, గింజలు నిండడం తగ్గిపోతుంది. నువ్వులు, పొద్దుతిరుగుడు పంటల పూత సమయంలో తీవ్రమైన వేడి వల్ల పుప్పొడి సరిగ్గా ఏర్పడక గింజలపై ప్రభావం చూపుతుంది. కూరగాయల పంటల్లో పూత రాలిపోతుంది. ఆకుకూరగాయలు వాడిపోతాయి.

● యాసంగి పంటల్లో

ఏం చేయాలంటే..

నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి సాగును దూరంగా పెట్టాలి. మిగతా ఆరుతడి పంటలకు ఉదయం లేదా సాయంత్రం నీరు పెట్టాలి. డ్రిప్‌, స్పింకర్ల పద్ధతితో నీరు ఆదా అవుతుంది. పంట దశ, నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి నీటి తడుల వ్యవధిని పెంచాలి. పంటలకు పెట్టిన నీరు ఆవిరికాకుండా పంట ఆవశేషాలతో మల్చింగ్‌ చేయాలి. అవసరానికి మించి భూమిని లోతుగా దున్నవద్దు. అధిక వేడి సమయంలో పంటలకు పిచికారీ వద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement