కరీంనగర్‌లో 34శాతం పెరిగిన డిమాండ్
పెద్దపల్లిలో లోడ్ తగ్గించే చర్యలు
సిరిసిల్లలో 15 సబ్‌స్టేషన్లపై భారం
జగిత్యాలలో కేటాయింపులకు మించి వినియోగం
సాక్షి, పెద్దపల్లి/కొత్తపల్లి:
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ‘షాక్’నిస్తోంది. సాధారణంగా సెప్టెంబర్‌లో వర్షాలు కురిసి వ్యవసా య పంపుసెట్ల వినియోగం తగ్గాల్సి ఉండగా.. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగి పంపిణీ వ్యవస్థపై ఒత్తిడి తీవ్రమవుతోంది. దీంతో విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫీడర్లు ఓవర్‌లోడ్‌తో సతమతమవుతున్నాయి. ఎండల తీవ్రతతో ఇళ్లలో ఏసీలు, ఫ్యాన్ల వినియోగం అధికమైంది. వ్యవసాయం, గృహావసరాలకు ఏకకాలంలో డిమాండ్ పెరిగి సబ్‌స్టేషన్లపై అదనపు భారం పడుతోంది.
ఫీడర్లపై నిరంతర నిఘా
డిమాండ్ పెరిగి ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై భారం తీవ్రం కావడంతో విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. ఓవర్‌లోడ్‌తో ఫీడర్లు ట్రిప్ కావడం, డీటీఆర్‌లు దెబ్బతినడం, లోఓల్టేజీ సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో కీలక సబ్‌స్టేషన్లలో లోడ్ పరిస్థితిని తరచూ పర్యవేక్షిస్తోంది.
వేసవికి ముందే హెచ్చరిక
సెప్టెంబర్‌లోనే పలు సబ్‌స్టేషన్లు ఓవర్‌లోడ్ స్థాయి కి చేరడం హెచ్చరికగా మారింది. ప్రస్తుతం వ్యవసాయ పనులు సాగుతుండగా, గృహ విద్యుత్ వినియోగంతో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
కరీంనగర్ జిల్లాలో విద్యుత్ డిమాండ్ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో 1,086.89 మెగావాట్లు ఉన్న గరిష్ట డిమాండ్.. ఈఏడాది అదే నెలలో 1,456.48 మెగావాట్లకు చేరింది. అంటే 34 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో కొన్నిప్రాంతాల్లో లోఓల్టేజీ సమస్య ఏర్పడుతోంది. తద్వారా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు) దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతోంది. సమస్యను అధిగమించేందుకు 12 పీటీఆర్‌ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఏడు అదనపు పీటీఆర్‌లను ఏర్పాటు చేశారు. వీటిపై భారం తగ్గించేందుకు 32 లైన్ కెపాసిటర్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 692 కొత్త డీటీఆర్‌లు, 548 అదనపు డీటీఆర్‌లు, 36 బంచ్‌బ్ బ్రేకర్లు ఏర్పాటు చేయనున్నట్లు కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ ఐరెడ్డి విజేందర్‌రెడ్డి తెలిపారు. హుజూరాబాద్ డివిజన్‌లో ఇప్పటికే ఐదు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లాలోనూ ఓవర్‌లోడ్ సమస్య కనిపిస్తోంది. 80 విద్యుత్ సబ్‌స్టేషన్లలో మూడింటిపై అధికలోడ్ పడుతోంది. ఇందులో మీర్జంపేట, కొత్తూరు, లోకపేట ఉన్నాయి. లోడ్‌ను సమతుల్యం చేసేందుకు ఇప్పటికే 23 ఫీడర్లను డైవర్ట్ చేశారు. ఓవర్‌లోడ్ సబ్‌స్టేషన్లలో ఒకదానికి పీటీఆర్ కేటాయించగా.. త్వరలోనే అందుబాటులోకి రానుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏడు కొత్తసబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నారు. మరోమూడింటి సామర్థ్యం పెంచడంతోపాటు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 85 సబ్‌స్టేషన్లలో 15 ఓవర్‌లోడ్ సమస్య ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేటలో లోడ్ అత్యధికంగా నమోదవుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో 114 మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉన్న వినియోగం ఈ ఏడాది అదేనెలలో 143 ఎంయూకు చేరి దాదాపు 25.4 శాతం పెరుగుద నమోదైంది. ఏడాదిలోనే 29 ఎంయూ అదనంగా వినియోగం కావడం పంపిణీ వ్యవస్థపై పెరిగిన ఒత్తిడికి అద్ధం పడుతోంది.
జగిత్యాల జిల్లాలో విద్యుత్ వినియోగం ఏడాదిలో 33.3 శాతం పెరిగింది. గతేడాది సెప్టెంబర్‌లో 89.982 ఎంయూ వినియోగం కాగా.. ఈ ఏడాది అది 119.96 ఎంయూకు చేరింది. ఈఏడాది జి ల్లాకు కేటాయించిన కోటా 93.3 ఎంయూ అయితే, దాదాపు 27 ఎంయూ అధికంగా వినియోగం నమోదైంది. జిల్లాలో రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 327.89 మెగావాట్లుగా నమోదైంది.


