గిద్దెపెరుమాండ్ల స్వామిది ఏ డివిజనో? దసరా ఉత్సవ వేళ తారాస్థాయికి పంచాయితీ 9,10 డివిజన్ల కార్పొరేటర్ల మధ్య వివాదం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని గిద్దె పెరుమాండ్ల స్వామికి పెద్ద చిక్కే వచ్చి పడింది. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఈ గుడి తమ డివిజన్‌కే వస్తుందంటూ 9, 10 డివిజన్ల కార్పొరేటర్ల నడుమ నెలకొన్న పాత పంచాయితీ సరికొత్తగా తెరపైకి వచ్చింది. గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయం ఏ డివిజన్‌లో ఉందో చెప్పాలంటూ ఏకంగా టౌన్‌ప్లానింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వేర్వేరు పార్టీలకు చెందిన 9,10 డివిజన్ల కార్పొరేటర్ల నడుమ మొదలైన వివాదం క్రమేపీ రాజకీయ రంగు పులుముకొంటోంది.
ఇంతకీ.. ఏ డివిజన్?
నగరంలోని ప్రముఖ గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయంలో ఏటా దసరా, సంక్రాంతి, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దసరా ఉత్సవాలకు నగరవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు తరలివస్తుంటారు. ఉత్సవాల వేళ స్థానిక కార్పొరేటర్ ప్రొటోకాల్ ఉంటుంది. ఇంటినంబర్ ఆధారంగా ఆలయం 9వ డివిజన్‌లో ఉండగా, గుడి ఆవరణ తమ డివిజన్‌లోకి వస్తుందంటూ 10వ డివిజన్ కార్పొరేటర్ వాదిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా 10వ డివి జన్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య ఆలయంలో షెడ్ నిర్మాణాన్ని చేపట్టారు. పనుల సమయంలో 9వ డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్యకు సమాచారం ఇవ్వలేదు. తమ డివిజన్‌లో జరిగే కార్యక్రమానికి సమాచారం ఇవ్వకపోవడంపై ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దసరా ఉత్సవాలు ఆలయంలో భారీ ఎత్తున జరగనుండడంతో మరోసారి గుడి డివిజన్‌పై రగడ మొదలైంది.
టౌన్‌ప్లానింగ్‌కు దరఖాస్తు
గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయం ఏ డివిజన్‌లోకి వస్తుందో చెప్పాలంటూ నగరపాలకసంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగానికి ఓ కార్పొరేటర్ దరఖాస్తు చేశారు. దీనిపై దృష్టి సారించిన అధికారులు కసరత్తు ప్రా రంభించారు. ఆలయం ఇంటి నంబర్ 8–7–178 నగరపాలకసంస్థ రికార్డుల ప్రకారం 9వ డివిజన్‌లో ఉంది. పైగా ఇదే గుడి (ఇంటి)నంబర్‌పై పూజారి కుటుంబానికి 9వ డివిజన్‌లో ఓట్లు ఉన్నాయి.
రాజకీయ రగడ
9, 10 డివిజన్ కార్పొరేటర్ల మధ్య నెలకొన్న ఆలయ వివాదం క్రమంగా రాజకీయ రూపు సంతరించుకొంటోంది. 9వ డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందగా, 10వ డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య స్వతంత్రుడిగా గెలుపొంది బీజేపీలో చేరా రు. దీంతో ఇరుపార్టీల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక ఇద్దరు కార్పొరేటర్లకు అవకాశం కల్పించాలనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 9వ డివిజన్‌లో ఉన్న గుడికి మరో కార్పొరేటర్‌కు అవకాశం ఎలా ఇస్తారంటూ పడిశెట్టి వసంతలక్ష్మిభూమయ్య వాదిస్తున్నారు. గుడి ఆవరణ కూడా 9వ డివిజన్‌లోనే ఉందంటున్నారు.
గిద్దెపెరుమాండ్ల స్వామి దేవాలయం ఏ డివిజన్‌లోకి వస్తుందో అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. గుడి ఇంటి నెంబర్ 9వ డివిజన్‌లో ఉందని, గుడి ఆవరణ 10వ డివిజన్‌లో ఉందని ఆయా కార్పొరేటర్లు మా దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకొంటాం.
– బషీర్, డీసీపీ, నగరపాలకసంస్థ
గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయం


