కథలాపూర్: కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన కండ్లి నాగరాజు(29) ట్రాక్టర్‌పై నుంచి పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు కొన్నేళ్లుగా మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. మొక్కజొన్న పంట కోసేందుకు బుధవారం ఉదయం కూలీలతో కలిసి ట్రాక్టర్‌పై వెళ్తుండగా.. స్పృహతప్పి ట్రాక్టర్‌పైనుంచి పడిపోయాడు. తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం కోరుట్ల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య అంకిత, కుమారుడు, కూతురు ఉన్నారు. అంకిత ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. అంకిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు.
స్వగ్రామం చేరిన మృతదేహం
కథలాపూర్: కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామానికి చెందిన మోర్తాడు గంగారాం(58) దుబయిలో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. గంగారాం ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా దుబయి వెళ్తున్నాడు. అబుదాబి ఏరియాలోని జీసీసీ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈనెల ఒకటో తేదీన పని ప్రదేశంలో గంగారాంకు గుండెపోటు రావడంతో తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందాడు. మృతదేహం ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గంగారాంకు భార్య గంగు, కుమారుడు శశికుమార్ ఉన్నారు.
ఇంటికి నీళ్లు పడుతుండగా కరెంట్ షాక్
సుల్తానాబాద్ రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయకాలుకు చెందిన వనపర్తి రాజుకుమార్(24) బుధవారం విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కొత్తగా నిర్మితమవుతున్న ఇందిరమ్మ ఇంటికి నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ గురై కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని కుటుంబ సభ్యులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని బంధుమిత్రులు డిమాండ్ చేస్తున్నారు.
భూ వివాదంలో తల్లీకొడుకులపై కేసు
చందుర్తి(వేములవాడ): భూవివాదంలో తల్లి, కొడుకులపై కేసు నమోదైనట్లు చందుర్తి ఎస్సై రమేశ్ తెలిపారు. రాజన్నసిరిసిల్ల చందుర్తి మండలం నర్సింగాపూర్‌కు చెందిన నేరెళ్ల మల్లేశం అదే గ్రామానికి చెందిన నేరెళ్ల శారద వద్ద సర్వే నంబర్ 337లో 0.07 గుంటలు భూమిని 2022లో కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన భూమిలో కాంపౌండ్‌వాల్ పాతపునాదిపై పెట్టుకుంటుండగా.. తమకు భూమి వస్తుందని, వెంగళ లత, అతని కుమారుడు మారుతి పనులు అడ్డుకుంటూ నెట్టి వేయడమే కాకుండా బూతులు తిట్టాడని మల్లేశం ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ వివరించారు.


