వేములవాడ: రాజన్నకు 40 రోజుల్లో హుండీల ద్వారా రూ.1,38,24,600 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి బుధవారం తెలిపారు. భీమేశ్వర సదన్ పార్కింగ్ స్థలంలో చేపట్టిన ఈ లెక్కింపులో మిశ్రమ బంగారం 66 గ్రాములు, మిశ్రమ వెండి 5.500 కిలోలు లభించినట్లు వెల్లడించారు. కరీంనగర్ దేవాదాయశాఖ ఏసీ కార్యాలయం పరిశీలకులు రాజమౌళి, డీఈవో ప్రతాప నవీన్, శివరామకృష్ణ భజన మండలి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
భార్యను వేధించిన భర్తపై కేసు
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని సాయిరాంనగర్ ప్రాంతానికి చెందిన విశ్వనాథ ప్రవళికను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న ఆమె భర్త పవన్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. కొద్దికాలంగా పవన్‌కుమార్ నిత్యం మద్యం తాగి వచ్చి ప్రవళికను హింసించడంతోపాటు, వేధిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా ఆమెను వేధించడంతో బాధితురాలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పవన్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పూడది వెంకటేశ్(35)అనే ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం జగ్గంపల్లికి చెందిన పూదరి రమేశ్ ట్రాక్టర్‌లో ధాన్యం లోడ్ చేసుకుని సుల్తానాబాద్‌కు వస్తున్నాడు. పట్టణ శివారులోని రైస్‌మిల్లు అసోసియేషన్ సమీపంలో పెద్దపల్లి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్ ట్రాక్టర్ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొంటున్నట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు..
జగిత్యాలక్రైం: మేడిపల్లి మండలం భీమారం, రంగాపూర్ గ్రామాల మధ్య బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని నూతిపల్లి అక్షయ్ (28) మృతిచెందాడు. మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన అక్షయ్ తన అత్తగారి గ్రామమైన భీమారం మండలకేంద్రంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా రంగపేట శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. అక్షయ్ తలకు బలమైన గాయాలు కాగా.. స్థానికులు 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. అక్షయ్‌కు భార్య, కూతురు ఉన్నారు. స్నేహితులతో కలిసి సంతోషంగా ఉండే అక్షయ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో దమ్మన్నపేటలో విషాదం చోటుచేసుకుంది.


