● కరీంనగర్ జిల్లాలో ఏడాదికి 2వేల మంది బాధితులు ● దురలవాట్లే కారణమంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం
కరీంనగర్: మెదడుకు రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడినా, మెదడులోని రక్తనాళం చిట్లి రక్తస్రావం జరిగినా వచ్చే స్ట్రోక్ ప్రాణాలకు ముప్పుగా పరిణమించడంతోపాటు శాశ్వత వైకల్యానికి దారితీస్తోంది. ఒకప్పుడు వృద్ధుల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు 30ఏళ్లలోపు యువతలోనూ ఆందోళన కలిగిస్తోంది. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, పొగాకు వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ముప్పును పెంచుతున్నాయి. అకస్మాత్తుగా మాట పడిపోవడం, ముఖం ఒకవైపు వాలిపోవడం, చేయి లేదా కాలు బలహీనపడటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి చేరుకుంటే ప్రాణాలను కాపాడటంతోపాటు వైకల్య తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది.
మెదడుకు రక్తప్రసరణ ఆగితే ముప్పే
స్ట్రోక్‌ను సాధారణంగా మెదడుకు రక్తప్రసరణకు అంతరాయం కలిగే వ్యాధిగా చెబుతారు. మెదడులోని రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం వల్ల రక్తప్రసరణ నిలిచిపోవడాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళం చిట్లి మెదడులో రక్తస్రావం జరగడాన్ని హెమరేజిక్ స్ట్రోక్‌గా పేర్కొంటారు. ఈ రెండు పరిస్థితుల్లోనూ మెదడులోని కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందక దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎంత ఎక్కువ సమయం చికిత్స ఆలస్యమైతే అంత ఎక్కువగా మెదడు కణాలు దెబ్బతినే అవకాశం ఉంది.
లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆస్పత్రికి...
స్ట్రోక్ లక్షణాలు కనిపించినప్పుడు ఇంటి వద్దే తగ్గుతుందేమోనని వేచి చూడకూడదు. వెంటనే అత్యవసర వైద్యసేవలు అందించే ఆస్పత్రికి తరలించాలి. మెదడులో రక్తనాళం మూసుకుపోయిందా, రక్తస్రావం జరిగిందా అనేది సీటీ స్కాన్ లేదా ఎంఆర్‌ఐ వంటి పరీక్షల ద్వారా నిర్ధారించిన తర్వాతే చికిత్స నిర్ణయిస్తారు. రక్తనాళంలో గడ్డ ఏర్పడిన కొన్ని స్ట్రోక్ కేసుల్లో అర్హతను బట్టి లక్షణాలు మొదలైన నాలుగున్నర గంటలలోపు గడ్డను కరిగించే మందులు ఇవ్వవచ్చు. పెద్ద రక్తనాళాల్లో గడ్డ ఏర్పడిన ఎంపిక చేసిన కేసుల్లో రక్తనాళం ద్వారా ప్రత్యేక పరికరాన్ని పంపి గడ్డను తొలగించే చికిత్సను కూడా కొన్ని గంటల తర్వాత అందించే అవకాశం ఉంటుంది.
సకాలంలో స్పందిస్తే బెటర్
రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. పొగాకు, దూమపానానికి దూరంగా ఉండాలి. ఉప్పు, నూనె, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించి పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన శారీరక వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన బరువు, క్రమమైన వైద్య పరీక్షలు అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా స్ట్రోక్ లక్షణాలను కుటుంబ సభ్యులంతా గుర్తించేలా అవగాహన పెంచుకోవాలి. సకాలంలో స్పందిస్తే ప్రాణాలను కాపాడటంతోపాటు శాశ్వత వైకల్యాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
– సంజయ్ కమిన్వర్, న్యూరో ఫిజీషియన్


