శాతవాహన వర్సిటీలో తక్కువ
సంఖ్యలో రిపోర్ట్ చేసిన విద్యార్థులు
తొలిఫేజ్‌లో 758 సీట్లకు కేవలం 251 మంది చేరిక
బయోమెట్రిక్‌తో క్యాంపస్‌లో చేరేందుకు విముఖత ?
ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ విద్యార్థులకు భోజన సదుపాయం కరువు
కేవలం 33 శాతం మంది చేరికపై సర్వత్రా ఆందోళన
మరో రెండు ఫేజ్‌లలో 67 శాతం మంది చేరుతారా? అని అనుమానం
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
శాతవాహన యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లు తీవ్ర నిరాశపరిచాయి. యూనివర్సిటీలోని క్యాంపస్‌లో సైతం పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంపై అధ్యాపకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో క్యాంపస్‌లో వివిధ కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్లకు కేవలం 33 శాతం మంది విద్యార్థులే అడ్మిషన్ తీసుకోవడం చర్చానీయాంశంగా మారింది. పీజీ సెట్ కౌన్సెలింగ్ తొలివిడత ఈనెల 23వ తేదీతో ముగిసింది. మొత్తం సీట్లలో సగం సీట్లలోనూ విద్యార్థులు చేరనప్పుడు, సెకండ్, థర్డ్ ఫేజ్‌ల్లో మిగిలిన సీట్లు ఎలా భర్తీ అవుతాయన్న ప్రశ్న విద్యార్థులు, అధ్యాపకులలో మొదలైంది.
ఫిజిక్స్‌లో ఒక్కరు.. సోషియాలజీలో ఆరుగురు
ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఫిజిక్స్ విభాగంలో ఒకేఒక్క విద్యార్థి చేరగా, సోషియాలజీలో ఆరుగురు చేరారు. ఈ విభాగాల్లో విద్యార్థుల కన్నా అధ్యాపకుల సంఖ్య అధికం కావడం గమనార్హం. ఎంఏ ఉర్దూ, ఎంఏ ఇంగ్లిష్, ఎంఎస్‌డబ్లూ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ కోర్సుల్లో పదిలోపు విద్యార్థులు జాయినయ్యారు. దాదాపుగా అన్ని డిపార్ట్‌మెంట్ల పరిస్థితి ఇలాగే తయారైంది. యూనివర్సిటీలో కేటాయించిన సీట్ల కన్నా చేరిన విద్యార్థుల సంఖ్య చూసి అధ్యాపకులు ఒకరిద్దరి కోసం ఏడాది మొత్తం పాఠాలు చెప్పాలా? అని తల పట్టుకుంటున్నారు. ఈ చేరికలు వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఉస్మానియా, కాకతీయలో సీటు కోసం ఎదురుచూసే విద్యార్థులంతా సెకండ్, థర్డ్ ఫేజ్‌లలో చేరే అవకాశాలున్నాయని కొందరు అధ్యాపకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంతటి కనిష్టస్థాయిలో విద్యార్థులు రిపోర్టు చేయడం నానాటికీ పీజీ కోర్సులకు తగ్గుతున్న ఆదరణకు నిదర్శనమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
బయోమెట్రిక్ భయపెట్టిందా?
యూనివర్సిటీలో ఆర్ట్స్, సైన్స్ కలిపి మొత్తం 18వరకు కోర్సులున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బయోమెట్రిక్ విధానం కారణంగానే విద్యార్థులు చేరేందుకు వెనకడుగు వేస్తున్నారన్న అపవాదును యూనివర్సిటీ మూటగట్టుకుంది. గత విద్యా సంవత్సరంలో హాజరుశాతం తక్కువగా ఉందన్న కారణంతో పలు కోర్సుల విద్యార్థులను పరీక్షలు రాయకుండా చేసిన సంఘటన ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలపై ప్రభావం చూపిందని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు బహిరంగంగానే విమర్శి స్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని అన్ని యూని వర్సిటీలలో బయోమెట్రిక్ విధానం ఉన్నా.. ఇక్కడ కఠినంగా అమలవుతుందని విద్యార్థులు వాపోతున్నారు. అదే సమయంలో శాతవాహన పరిధిలోని ఏ అనుబంధ, ప్రైవేటు కాలేజీలో లేని బయోమెట్రిక్ అమలు కాకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. పైగా పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడే లైబ్ర రీలో విద్యార్థులకు ఆంక్షలు విధించడం, ప్రతీ చిన్న విషయానికి పోలీసులను క్యాంపస్‌లోకి పిలి పించి విద్యార్థులపై కేసులు పెట్టిస్తామంటూ బెది రించడం కూడా వర్సిటీ ప్రవేశాలపై ప్రతికూల ప్రభా వం చూపిందని విద్యార్థులు వాపోతున్నారు. అదే సమయంలో ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం లేకపోవడం కూడా ప్రవేశాలు తగ్గేందుకు పరోక్ష కారణమైందని చెబుతున్నారు.
శాతవాహన యూనివర్సిటీ


