విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

ఎల్‌ఎండీ @ 16 టీఎంసీలు క్వింటాల్‌ పత్తి రూ.8,021

కరీంనగర్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్‌ సంజయ్‌ జాజు సూచించారు. విద్యార్థుల హాజరు, భోజనం, పారిశుధ్యం, భద్రత, ఉపాధ్యాయుల పనితీరు, లెర్నింగ్‌ ఔట్‌కమ్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌ నుంచి కలెక్టర్‌ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో కలెక్టర్లు తరచూ ఆకస్మిక తనిఖీలు చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్‌ అధికారులతో సమీక్షించారు. పాఠశాలలు, వసతి గృహాలను తరచూ సందర్శించి విద్యార్థుల భద్రత, భోజనం, పారిశుధ్యంపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

కుల వివక్షపై పోరాడిన మహాకవి జాషువా

కరీంనగర్‌కల్చరల్‌: కుల వివక్ష, సామాజిక అసమానతలు, అంటరానితనంపై తన కలంతో తిరుగుబాటు చేసిన మహాకవి గుర్రం జాషువా అని తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు అన్నారు. తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో సోమవారం జాషువా జయంతి నిర్వహించారు. జాషువా కేవలం కవి మాత్రమే కాదని, అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని తన సాహిత్యంలో ప్రతిధ్వనింపజేసిన సామాజిక చైతన్యవాదని పేర్కొన్నారు. ప్రముఖ వ్యాసకర్త సంపతి రమేశ్‌ మహారాజు మాట్లాడుతూ.. విద్య, సాహిత్యం, ఆత్మగౌరవం, సమానత్వం ద్వారా అణగారిన వర్గాలు ముందుకు రావాలనే సందేశం జాషువా రచనల్లో కనిపిస్తుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మానువాడ శంకర్‌, పుత్తూరు దేవదాస్‌, మురళీకృష్ణ, రిటైర్డ్‌ ఎస్‌ఐ మొండయ్య, మాజీ ఉప సర్పంచ్‌ దేవయ్య, బొంగని పరశురాములుగౌడ్‌, సంటి కుమార్‌, చిలుపు రాములు, జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

అనుమతించిన ఎరువులు మాత్రమే విక్రయించాలి

చిగురుమామిడి: జిల్లాలో ఎరువుల డీలర్లు ప్రభుత్వం అనుమతించిన కంపెనీల ఎరువులను మాత్రమే విక్రయించాలని, అనుమతి లేని ఇతర బ్రాండ్లు, నకిలీ ఎరువులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలుంటాయని జిల్లా వ్యవసాయాధికారి ఛత్రునాయక్‌ హెచ్చరించారు. సోమవారం చిగురుమామిడి మండలంలో ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాత స్టాక్‌, రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. ప్రతీ రైతు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలన్నారు. ఏవో పున్నం చందర్‌, చిగురుమామిడి ఎస్సై జగదీశ్వర్‌, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు.

తిమ్మాపూర్‌: లోయర్‌ మానేరు డ్యామ్‌ (ఎల్‌ఎండీ) నీటి మట్టం 16 టీఎంసీలకు చేరుకుంది. గత కొద్ది రోజులుగా మిడ్‌ మానేరు నుండి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. మిడ్‌ మానేరు నుండి 8 వేల క్యూసెక్కులకు పైగా నీరు ఎల్‌ఎండీలోకి వస్తోంది. 24 టీఎంసీల సామర్థ్యం గల ఎల్‌ఎండీలో ప్రస్తుతం 16 టీఎంసీల నీరు ఉంది. మిడ్‌ మానేరు నుండి ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే ఎల్‌ఎండీ త్వరలో నిండుకుండలా మారే అవకాశం ఉంది.

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో సోమవారం కొత్తపత్తి క్వింటాల్‌కు రూ.8,021 పలికింది. క్వింటాల్‌కు మోడల్‌ ధర రూ.7,750. కనిష్ట ధర రూ.6,000. పాత పత్తి 4 వాహనాల్లో 45 క్వింటాళ్లను రైతులు అమ్మకానికి తీసుకురాగా.. క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.8,150, మోడల్‌ ధర రూ.8,050, కనిష్ట ధర రూ.7,800కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను గ్రేడ్‌–2 కార్యదర్శి మల్లేశం పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement