కరీంనగర్‌క్రైం/కరీంనగర్‌టౌన్ : చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా నేరాలకు దూరంగా ఉండి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్‌సింగ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ (ఆర్ట్స్)లో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే రాజ్యాంగ హక్కులు, పౌర బాధ్యతలపై అవగాహన ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం, రవాణాపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు, సోషల్ మీడియా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎ.కిరణ్‌కుమార్, పెరుక రంగయ్యపటేల్, చిట్టి చంద్రప్రకాష్‌రెడ్డి, డీఐఈవో ఎ.సత్యనారాయణ, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎన్.పద్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయసేవల అవగాహన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు.
ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలి
జమ్మికుంట: ప్రశాంతంగా గణేశ్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. పట్టణంలోని నాయిని చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను శుక్రవారం సీపీ, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోలీస్, మున్సిపల్ అధికారులకు ప్రజలు సహకరిస్తూ సురక్షితంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి, టౌన్ సీఐ రామకృష్ణ, కమిషనర్ మల్లికార్జునస్వామి, కౌన్సిలరు పాల్గొన్నారు.
కరీంనగర్‌అర్బన్: పీఆర్‌సీ, పెండింగ్ డీఏలు, ఈహెచ్‌ఎస్, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం తక్షణం నిర్ణయాలు తీసుకోవాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం టీఎన్జీవో భవన్‌లో నిర్వహించిన సమావేశంలో చైర్మన్, జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్‌గౌడ్ మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఈ నెల 18న సమావేశం నిర్వహిస్తుందని ప్రకటించడంతో, తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఉత్కంఠతో ఎదురుచూశారని, మరోసారి వాయిదా వేయడంపై ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోందని అన్నారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించేలా వ్యవహరించకుండా, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంగెం లక్ష్మణ్‌రావు, డాక్టర్ అరవింద్‌రెడ్డి, గూడ ప్రభాకర్‌రెడ్డి, విజయకుమార్, ఇరుమల్ల శారద, మారుపాక రాజేశ్‌భరద్వాజ్, నాగరా జు, సత్యనారాయణ, నరేశ్ పటేల్, సునీత, సూర్య, శైలజ, సుస్మిత, అజ్గర్‌అలీ, కోట రామస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌అర్బన్: మూడురోజులుగా వేసవిని మరిపిస్తుండగా గురువారం రాత్రి నుంచి ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కపోతతో సకల వర్గాలు సతమతం కాగా జిల్లావ్యాప్తంగా చిరుజ ల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. రేణికుంట(తిమ్మాపూర్)లో అత్యధికంగా 2.3సెంటిమీటర్ల వర్షపాతం నమోదవగా, ఇందుర్తి(చిగురుమామిడి)లో 2.3సెం.మీలు, ఖాసీంపేట(గన్నేరువరం)లో 1.9, దుర్శేడ్(కరీంనగర్ రూరల్)లో 1.6, ఈదులగట్టెపల్లి(మానకొండూరు)లో 1.4, చింతకుంట(కొత్తపల్లి)లో 1.2, వెన్కపల్లి(సైదాపూర్)లో 1.0, బోర్నపల్లి(హుజూరాబాద్)లో 1.0, మల్యాల(ఇల్లందకుంట) 6.8మి.మీ, కరీంనగర్ అర్బన్ 3.8మి.మీ, కొత్తగట్టు(శంకరపట్నం)లో 3.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


