● ఎస్పీ మహేశ్ బీ గీతే
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన(పోక్సో) కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. రూ.వెయ్యి జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మైనర్ బాలికను మధ్యప్రదేశ్‌కు చెందిన చతుర్‌సింగ్ మున్నా అనే వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో ఎల్లారెడ్డిపేట అప్పటి సీఐ బన్సిలాల్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అప్పటి డీఎస్పీ చంద్రశేఖర్ దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు కానిస్టేబుళ్లు 19 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఝాన్సీ వాదించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు చతుర్‌సింగ్ మున్నాకు 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించారు.


