● అడవిసోమన్‌పల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ ● తోబుట్టువు దాచిన నెక్లెస్.. చిన్నారుల కానుకలు అపహరణ ● నాలుగున్నర తులాల బంగారం.. 31తులాల వెండి ● రూ.47వేల నగదును ఎత్తుకెళ్లిన దుండగులు
మంథనిరూరల్: తాళం వేసిఉన్న ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు ఉన్నదంతా ఊడ్చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో కలకలం రేపింది. అడవిసోమన్‌పల్లి గ్రామానికి చెందిన పంగ శ్రీకాంత్ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన చోరీలో దాచుకున్న నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, 31 తులాల వెండి, రూ.47వేల నగదు అపహరించారు. బాధితుల కథనం ప్రకారం.. పంగ శ్రీకాంత్ మంథనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. పది రోజులుగా నైట్‌డ్యూటీ చేస్తున్నాడు, గురువారం యథావిధిగా నైట్ డ్యూటీకి వెళ్లగా అతని భార్య స్వప్న ఇంటికి తాళం వేసి సమీపంలోని తల్లిగారింట్లో పిల్లలతోకలిసి నిద్రించేందుకు వెళ్లింది. శుక్రవారం తెల్లవారుజామున శ్రీకాంత్ తల్లి దుర్గమ్మ అటువైపుగా వెళ్లగా ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి లోనికి వెళ్లింది. బీరువా తెరిచి ఉండి సామాన్లు చిందరవందరగా పడి ఉండటంతో దొంగలు పడినట్లు గుర్తించి కోడలు స్వప్నకు చెప్పింది. వారువచ్చి గమనించగా బంగారు ఆభరణాలు, వెండి, నగదు కన్పించలేదు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించారు.
ఇటీవలే కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకలు
శ్రీకాంత్ – స్వప్న దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇటీవలనే కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు వచ్చిన బంగారు, వెండి కానుకలను బీరువాలో దాచిపెట్టగా వాటిని దొంగలు ఎత్తుకు పోయినట్లు వారు బోరున విలపించారు.
తోబుట్టువు బంగారు నెక్లెస్ కూడా..
పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన శ్రీకాంత్ తోబుట్టువు తన ఆడబిడ్డకు నెక్లెస్ ఇచ్చి మెడలో వేసుకోమంది. ఆ తర్వాత ఆ నెక్లెస్‌ను ఇక్కడే దాచి పెట్టమని చెప్పింది. అంతేకాకుండా శ్రీకాంత్ నూతనంగా ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా డబ్బులు లేక అర్థాంతరంగా ఆగిపోవడంతో సోదరి విషయం తెలుసుకుని పనులు పూర్తి చేసుకోమని రూ.50వేలు ఇచ్చి వెళ్లింది. బీరువాలో దాచిపెట్టిన తోబుట్టువు నెక్లెస్‌తోపాటు ఆమె ఇచ్చిన రూ.50వేలలో మిగిలిన ఉన్న రూ.47వేలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంలతో..
సమాచారం అందుకున్న మంథని సీఐ స్వామి, ఎస్‌ఐ సందీప్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరించారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.


