పేదింటి పిల్లలకు పెద్ద భరోసా
49వేల మంది విద్యార్థుల కోసం ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్’
రూ.8 కోట్లతో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్
నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
669 ప్రభుత్వ పాఠశాలలు, 11 కళాశాలల విద్యార్థులకు లబ్ధి
రాత్రి ఒంటి గంటనుంచే వంట, ఉదయం 8.30 గంటలకు అందజేత
తొలిదశలో కరీంనగర్ రూరల్, చిగురుమామిడి, సైదాపూర్‌కు
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
ఉదయం పూట కడుపు నిండా తిండి లేకుండా పాఠశాలకు వచ్చే పిల్లవాడు పాఠంపై ఎంతమేర దృష్టి పెట్టగలడు? పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ప్రశ్నకు సమాధానం ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితితో ముడిపడి ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు పనులకు వెళ్లే తొందర.. పిల్లలను పాఠశాలకు పంపించే ఆత్రుత.. ఫలితంగా కొందరు విద్యార్థులు అల్పాహారం లేకుండానే బడిబాట పడుతుంటారు. ఈ పరిస్థితిని మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాం’ జిల్లాలో వేలాది మంది విద్యార్థులకు అండగా నిలవనుంది. కరీంనగర్ మార్కెట్ యార్డులో సుమారు రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను బుధవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. రోజుకు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించే సామర్థ్యంతో ఈ కిచెన్‌ను రూపొందించారు. దీని ద్వారా కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లోని 17 మండలాల్లో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 49,025 మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది.
పేదింటి పిల్లలకు పెద్ద ఊరట
ఉదయం వేళ తల్లిదండ్రులు కూలీ పనులు, ఉద్యోగాలకు వెళ్లే కుటుంబాల్లో పిల్లలకు అల్పాహారం సిద్ధం చేయడం కష్టంగా మారుతుంటుంది. అలాంటి విద్యార్థులకు పాఠశాలలోనే పోషకాహారంతో కూడిన అల్పాహారం అందడం వల్ల ఆకలి సమస్య కొంతమేర తీరనుంది. ఆకలితో తరగతిలో కూర్చోవాల్సిన పరిస్థితి తగ్గడంతో పిల్లలు పాఠాలపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. అల్పాహారం కేవలం కడుపు నింపే ఆహారం మాత్రమే కాదు, పిల్లల ఆరోగ్యం, ఏకాగ్రత, తరగతి గది భాగస్వామ్యం, హాజరు, విద్యా పనితీరుకు దోహదపడే అంశం. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఇది అదనపు ప్రయోజనం.
నీరసం, అలసట లేకుండా..
ఉదయం ఆకలితో ఉండటం వల్ల వచ్చే నీరసం, అలసటను తగ్గించేందుకు పోషకాహారం ఉపయోగపడుతుంది. సమయానికి అల్పాహారం అందితే ఆలస్యంగా పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ చదువుపై దృష్టి పెట్టేందుకు ఇది దోహదం చేయనుంది.
కొడంగల్ నియోజకవర్గంలో..
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరు 75 నుంచి 90 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏకాగ్రత, తరగతి గది భాగస్వామ్యం, సమయపాలనలోనూ సానుకూల మార్పులు నమోదయ్యాయి.
వంట బాధ్యత నుంచి టీచర్లకు విముక్తి
కేంద్రీకృత వంటశాల మరో ముఖ్యమైన ప్రయోజనం. పాఠశాలల్లో వంట, ఆహార ఏర్పాట్లకు వెచ్చించే సమయం, సిబ్బంది శ్రమ తగ్గడం. దీంతో
ఉపాధ్యాయులు పూర్తిగా బోధన, విద్యార్థుల అభ్యాసంపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. దోస, ఇడ్లీ, పూరీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ వంటి విద్యార్థులకు సుపరిచితమైన ఆహార పదార్థాలతో వారపు మెనూను రూపొందించారు. అవసరమైన పోషకాలను దృష్టిలో పెట్టుకుని వయస్సుకు తగిన మోతాదులో ఆహారం అందించనున్నారు. మెనూ రూపకల్పనలోనూ సహకారం తీసుకున్నారు.
49 వేల కుటుంబాలకు పరోక్ష ప్రయోజనం
జిల్లాలో 49,025 మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం అంటే దాదాపు అంతే సంఖ్యలో కుటుంబాలకు పరోక్షంగా ఊరట కల్పించడమే. రోజూ పిల్లల ఉదయపు అల్పాహారం కోసం అయ్యే ఖర్చు, సమయం కొంతమేర ఆదా కావడంతో పేద కుటుంబాలకు ఇది ఆర్థికంగా ఉపయోగకరంగా మారనుంది. అందుకే కరీంనగర్‌లోని ఈ కిచెన్‌ను కేవలం వంటశాలగా కాకుండా పేదింటి పిల్లల ఆక
లిని తీర్చే కేంద్రంగా, వారి చదువుకు ఊతమిచ్చే
కేంద్రంగా చూడాల్సిన అవసరం ఉంది.
పోషకాహారంతో వారపు మెనూ
విద్యార్థులకు పరిచయమైన ఆహార పదార్థాలతో మెనూ రూపొందించారు. సోమవారం ఇడ్లీ–సాంబార్, మంగళవారం పూరీ–ఆలూకుర్మా, బుధవారం దోశ–చట్నీ, గురువారం ఉప్మా–చట్నీ, శుక్రవారం మిల్లెట్‌ఇడ్లీ–సాంబార్, శనివారం బోండా–చట్నీ అందించనున్నారు. రోజు విడిచి రోజు పాలు కూడా అందించనున్నారు. పోషక సమతుల్యత, వయస్సుకు తగిన మోతాదును దృష్టిలో పెట్టుకుని, ఎన్‌ఐఎన్ సహకారంతో మెనూ రూపొందించారు.
రాత్రి ఒంటి గంటకు వంట మొదలు
కిచెన్‌లో కుకింగ్, క్లీనింగ్, డ్రైవింగ్ తదితర విభాగా లు కలిపి మొత్తం 100 మంది పనిచేస్తారు. రాత్రి 1 గంట నుంచే కూరగాయల కటింగ్ మొదలవుతుంది. ఉదయం 4 గంటలకు వంటలు ప్రారంభమై 6 గంటలకల్లా ముగుస్తాయి. ప్రతీ బడిలో ఉదయం.8.30 గంటల వరకు టిఫిన్ చేరిపోతుంది. ప్రతీ మండలానికి రెండు చొప్పున మొత్తం 34 ఆటోలు సిద్ధం చేస్తున్నారు. తిరిగి 11 గంటలకల్లా కిచెన్‌కు చే రతాయి. అక్కడ పాత్రలను అత్యాధునిక విధానంలో శుభ్రం చేస్తారు. తొలిదశలో కరీంనగర్‌రూరల్, చి గురుమామిడి, సైదాపూర్ మండలాల పాఠశాలల కు అందజేసి క్రమంగా అన్ని మండలాలకు విస్తరిస్తామని కిచెన్ నిర్వాహకులు, హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
నియోజకవర్గాల వారీగా
లబ్ధి పొందే విద్యార్థులు
నియోజకవర్గం విద్యార్థుల సంఖ్య
హుస్నాబాద్ 16,544
కరీంనగర్ 16,355
మానకొండూర్ 8,645
చొప్పదండి 7,481
మొత్తం 49,025
కమ్యూనిటీ కిచెన్
పిల్లల ఆరోగ్యమే పెట్టుబడి
రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొత్తం 17,72,291 మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా 31 జిల్లాల్లో కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు ప్రతిపాదించారు. సుమారు రూ.245 కోట్లతో ఈ వంటశాలు ఏర్పాటు చేయనున్నారు. కడుపు నిండితేనే చదువుపై దృష్టి.. ఆరోగ్యం ఉంటేనే భవిష్యత్తుపై ఆశ. ఈ రెండు అంశాలను కలిపే ప్రయత్నంగా ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాం’ నిలుస్తోంది. కరీంనగర్‌లో ప్రారంభమవుతున్న కమ్యూనిటీ కిచెన్ ద్వారా వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉదయాన్నే పోషకాహారం అందడం వారి విద్యాభ్యాసానికి చిన్న అడుగు అయినా.. భవిష్యత్‌కు మాత్రం పెద్ద బలం.


