గంగాధర: తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని, గ్రామస్తులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని 38 రోజులుగా రిలే నిరహార దీక్షలు చేస్తున్న గంగాధర మండలం నారాయణపూర్ వాసులు తమ గోడు పట్టించు కోండి సారూ.. అంటూ మంగళవారం మధురానగర్‌లోని ప్రజా కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి సమస్యలు విన్నవించారు. చెరువుకట్ట పనులు పూర్తయితే తమ గ్రామంలోకి జాలు నీరు వస్తుందని, ఇండ్లలోకి పాములు, తేల్లు వస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలోని కొన్ని ఇండ్లను మాత్రమే ముంపు కింద తీసుకొని తమకు అన్యాయం చేయవద్దన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ను నారాయణపూర్‌కు తీసుకువచ్చి సమస్యను వివరించానని గుర్తు చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులను జిల్లా కలెక్టర్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్దకు తానే తీసుకెల్తానని హామీ ఇచ్చారు. ముంపు కింద తీసుకున్న ఇండ్లు అర్హత లేనివైతే విచారణ చేపట్టి తొలగించాలని తహసీల్దార్ రజితకు సూచించారు.
నగర అభివృద్ధిలో ఇంజినీర్లే కీలకం
కరీంనగర్‌కార్పొరేషన్: నగర అభివృద్ధికి ఇంజినీర్లు వెన్నెముక లాంటి వారని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా నగరపాలకసంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నవ సమాజ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ కరీంనగర్‌ను ఆధునిక, సుందర, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ఇంజినీర్లు మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
కెనాల్‌లోకి నీరు విడుదల చేయాలి
కొత్తపల్లి(కరీంనగర్): వినాయక నిమజ్జన నిర్వహణకు చింతకుంట కెనాల్‌లోకి నీటిని విడుదల చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. చింతకుంట కెనాల్ నిమజ్జన కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఎస్సారెస్పీలో నీరు లేనందున విడుదలపై అనుమానాలున్నట్లు సమాచారం ఉందని, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వంతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేయాలని సూచించారు. ఎస్సారెస్పీ సీఈ సుమతితో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే కనీసం 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి అడ్డుకట్ట వేయడం ద్వారా 10–12 అడుగుల మేర నీటిని నిల్వ చేయవచ్చని తెలిపారు. నిమజ్జన సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ ప్రదీప్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


