జిన్నింగ్‌ మిల్స్‌ అసోిసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా బచ్చు భాస్కర్‌ | - | Sakshi
Sakshi News home page

జిన్నింగ్‌ మిల్స్‌ అసోిసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా బచ్చు భాస్కర్‌

Sep 9 2026 11:51 PM | Updated on Sep 9 2026 11:51 PM

జమ్మికుంట: జమ్మికుంటకు చెందిన ప్రముఖ వ్యాపారి బచ్చు భాస్కర్‌ ఉమ్మడి జిల్లా జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ మిల్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌లో దొనకొండ మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా బచ్చు భాస్కర్‌ ఏకగ్రీవం అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మిడి రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కక్కెరాల రమేశ్‌, జిన్నింగ్‌, ప్రెసింగ్‌ మిల్స్‌ సభ్యులు పాల్గొన్నారు.

గంజాయి విక్రయ కేసులో ఐదేళ్ల జైలు

కరీంనగర్‌ క్రైం: గంజాయితో పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి ఐదేళ్ల జైలు, రూ.1,000 జరిమానా విధిస్తూ కరీంనగర్‌ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి వెంకటేశ్‌ బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం జగిత్యాలలోని తులసీనగర్‌కు చెందిన జంబార్తి ఈశ్వర్‌(24) శుభకార్యాలకు డెకరేషన్‌ పనులు చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో గంజాయి విక్రయించి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్నాడు. 2022 అక్టోబర్‌ 17న గంజాయి విక్రయించేందుకు మానకొండూర్‌ చెరువు కట్ట వద్దకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కిలోకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ ఎం.రాజ్‌కుమార్‌ దర్యాప్తు చేపట్టారు. సాక్షులను సీఎంఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజేందర్‌, కోర్టు పీసీ మౌనిక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డి.శరత్‌ సాక్షులను విచారించారు. ఈశ్వర్‌ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించిన న్యాయమూర్తి ఐదేళ్ల జైలు, రూ.1,000 జరిమానా విధించారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రి అవుట్‌పోస్ట్‌ గేట్‌ ఎదుట మంగళవారం రాత్రి 40నుంచి 45 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు బూడిద రంగు గీతల షర్టు, నీలిరంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసిన వారు కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీసులను సంప్రదించాలని కోరారు.

చోరీ కేసులో మరో నిందితుడి అరెస్టు

గంగాధర: తాళం వేసిఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగల ముఠాలోని మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. గతంలో దొంగతనానికి పాల్పడిన నిందితుల్లో ఒకరైన గజవెల్లి వంశీ బుధవారం మధురానగర్‌లో దొంగతనం చేయడానికి వచ్చి, పోలీసులకు చిక్కాడు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకొని ఇటీవల దొంగతనానికి పాల్పడిన కొండ శశికాంత్‌, సీహెచ్‌.సంతోష్‌, గజవెల్లి వంశీతో కూడిన ముఠాపై నిఘా వేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కొండ శశికాంత్‌ను ఇప్పటికే అరెస్టు చేయగా, వంశీని సైతం అదుపులోకి తీసుకుని, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సంతోష్‌ కోసం గాలిస్తున్నారు.

ఒకరిపై దాడి చేసిన ముగ్గురిపై కేసు

జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద మంగళవారం రాత్రి పురాణం పవన్‌కుమార్‌పై దాడిచేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. కరీంనగర్‌ సమీపంలోని దుర్శేడ్‌ గ్రామానికి చెందిన పురాణం పవన్‌కుమార్‌ ట్రాలీ వాహనం నడుపుతుంటాడు. మంగళవారం ఉదయం ఆయిల్‌ కాటన్స్‌ తీసుకుని మెట్‌పల్లి వెళ్లి తిరిగి కరీంనగర్‌ వెళ్తుండగా మంచినీళ్ల బావివద్ద గొల్లపల్లి మండలం వెంగళాపూర్‌కు చెందిన దొనకంటి నరేశ్‌, లక్ష్మీపూర్‌కు చెందిన సంతోష్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి అతివేగంగా ఎందుకు వెళ్తున్నావంటూ వాహనాన్ని ఆపి అతనిపై దాడిచేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కుమారస్వామి తెలిపారు.

రైతు అనుమానాస్పద మృతి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిసిల్ల పట్టణం విద్యానగర్‌కు చెందిన రైతు జంగిటి శ్రీనివాస్‌(57) చింతల్‌ఠాణా శివారులోని తన పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం ఉదయం పశువుల గడ్డి కోసం పొలానికి వెళ్లిన ఆయన సాయంత్రం 7 గంటలైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పక్క పొలం వారికి ఫోన్‌ చేశారు. వారు వెళ్లి చూడగా శ్రీనివాస్‌ పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. శ్రీనివాస్‌ మరణానికి గుండెపోటు కారణమా లేదా మరేదైనా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement