దశాబ్దాల నిరీక్షణకు తెర! | - | Sakshi
Sakshi News home page

దశాబ్దాల నిరీక్షణకు తెర!

Sep 9 2026 11:51 PM | Updated on Sep 9 2026 11:51 PM

● సింగరేణి భూముల్లోని ఇళ్లకు పట్టాలు ● మంత్రి పొంగులేటి ప్రకటనతో ఆశలు ● కోల్‌బెల్ట్‌లో 8 వేల కుటుంబాలకు లబ్ధి

● సింగరేణి భూముల్లోని ఇళ్లకు పట్టాలు ● మంత్రి పొంగులేటి ప్రకటనతో ఆశలు ● కోల్‌బెల్ట్‌లో 8 వేల కుటుంబాలకు లబ్ధి

గోదావరిఖని: సింగరేణి భూముల్లో దశాబ్దాల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు జారీచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనతో కోల్‌బెల్ట్‌ ప్రాంతవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సొంతిళ్లు ఉన్నా వాటిపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు లేక, బ్యాంకు రుణాలు అందక దశాబ్దాలుగా అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిరీక్షణ ఫలించిన వేళ..

సింగరేణి బొగ్గు గనుల చుట్టూ ఏర్పడిన పట్టణాలు, కాలనీల్లో కార్మిక కుటుంబ సభ్యులు, వారసులు, కార్మికులపై ఆధారపడిన అనేక కుటుంబాలు ఉపాధి కోసం కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లోనే స్థిరపడ్డాయి. కాలక్రమేణా జనాభా పెరిగింది. సొంత స్థలం లేక ఖాళీ ప్రదేశాల్లో గుడిసెలు వేసుకుని, ఆ తర్వాత ఇళ్లుగా మార్చుకుని జీవనం సాగించారు. కొన్నికుటుంబాలు మూడు, నాలుగు తరాలుగా ఇక్కడే ఉంటున్నాయి. ఇల్లు ఉంది.. కరెంట్‌ బిల్లు ఉంది.. ఇంటి పన్ను ఉంది.. కానీ భూమిపై హక్కు లేదు. వేలాది కుటుంబాలను వెంటాడుతున్న ప్రధాన సమస్య ఇది.

17వేల మందికి పట్టాలిచ్చిన వైఎస్సార్‌

సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారి సమస్యలు ఆలకించిన అప్పటి సీఎం, దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 ఏప్రిల్‌ 7న గోదావరిఖనిలో సుమారు 18వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అప్పట్లో వివిధ కారణాలతో మిగిలిపోయిన కొన్ని కుటుంబాలకు ఇప్పటికీ భూమిపై హక్కు దక్కలేదు. ఇలాంటి వారికి కూడా పట్టాలు ఇచ్చేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. సర్కారు నిర్ణయంతో కోల్‌బెల్ట్‌లోని మిగిలిన సుమారు 8 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందనున్నాయి.

సర్వే పూర్తయినా తప్పని నిరీక్షణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీవో నంబరు 76 జారీచేసి ఆక్రమణదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. నేపథ్యంలో పలుచోట్ల ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది స్థలాలను పరిశీలించి సర్వే చేశారు. వీరి నివేదిక ఆధారంగా 11 జూలై 2019న కొందరికి అధికారులు పట్టాలు ఇచ్చారు. కానీ, సాంకేతిక కారణాలతో చాలామందికి అప్పట్లో పట్టాలు అందకుండా పోయాయి. అంతేకాదు.. కొత్తగూడెం బర్మా క్యాంప్‌ కేసుల్లో జీవో 76 కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించినా తుదినిర్ణయం తీసుకోలేదని బాధితులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. దరఖాస్తులు పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది.

సింగరేణి నిర్ణయమే కీలకం

భూముల కేటాయింపులో సింగరేణి నిర్ణయం కూడా కీలకంగా మారనుంది. ప్రతీఆక్రమిత స్థలానికీ ఆటోమేటిక్‌గా పట్టా వస్తుందని భావించలేమని, భూమి సింగరేణి నుంచి ప్రభుత్వానికి అప్పగించారా? ఆ స్థలం ఏ సర్వే నంబర్‌లో ఉంది? ఆక్రమణకు సంబంధించిన కట్‌ఆఫ్‌ తేదీ నాటికి దరఖాస్తుదారు అక్కడే ఉన్నాడా? భూమి ప్రభుత్వ అవసరాలకు లేదా సింగరేణి కార్యకలాపాలకు అవసరమా? వంటి అంశాలు పరిశీలించాల్సి ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.

పట్టాతో చట్టబద్ధత

ఇప్పటివరకు ఇంట్లో నివసిస్తున్నామనే భావనతో ఉన్నారు. పట్టా లభిస్తే వారి స్థిరాస్తిపై చట్టబద్ధమైన హక్కు ఏర్పడుతుంది. దీంతోపాటు బ్యాంకు రుణాలకు అవకాశం లభిస్తుంది. వారసత్వ హక్కుల బదలాయింపు ప్రక్రియ సులభతరం అవుతుంది. భూమి రికార్డుల్లో పేరు నమోదై ఆస్తి వివాదాలూ తగ్గే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement