చైన్‌స్నాచింగ్, పల్సర్ బైక్‌లు అపహరణ
ఆభరణాలూ దొంగతనం
జల్సాల కోసం చోరీలు
అంతర్‌రాష్ట్ర దొంగను పట్టుకున్న పోలీసులు
పెద్దపల్లిరూరల్: పాలవ్యాపారం చేస్తే గిట్టుబాటు కావడం లేదని భావించిన ఇద్దరు యువకులు ఈజీమనీ కోసం అడ్డదారి ఎంచుకున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రైలులో వచ్చి తమకు అనువైన ప్రాంతంలో పార్కింగ్ చేసిఉన్న బైక్‌లు చోరీ చేస్తున్నారు. వాటిపైనే తిరుగుతూ.. ఒంటరి మహిళలు లక్ష్యంగా బంగారు గొలుసులను దొంగిలిస్తూ జల్సాలు చేస్తున్నారు. పెద్దపల్లి ప్రాంతంలో ఇలా ఎత్తుకెళ్లిన ఇద్దరిలో కలిరాం అనే నిందితుడు బుధవారం పెద్దపల్లి పోలీసుల చేతికి చిక్కగా.. కపిల్ అనే మరో నిందితుడు పారిపోయాడని డీసీపీ భూక్యా రాంరెడ్డి నాయక్ తెలిపారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో బుధవారం ఏసీపీ కృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లా కై రాన తాలుకా కాన్పూర్‌కాల గ్రామానికి చెందిన కలిరాం పాలవ్యాపారం చేస్తూ భార్యా, ముగ్గురు పిల్లలను పోషించడం, జల్సాలకు డబ్బులు సరిపోవడం లేదని భావించాడు. తన స్నేహితుడు అలావుద్దిన్‌పూర్ గ్రామానికి చెందిన కపిల్‌తో జత కలిసి మార్చి 30న పెద్దపల్లికి రైలులో చేరుకున్నారు.
మార్చి 30: పెద్దపల్లి రైల్వేకాలనీలో పార్క్ చేసిఉన్న పల్సర్‌బైక్ దొంగిలించి రామగుండం వైపు వెఎళ్తూ బందంపల్లిలో తనఇంటి ముందు ఒంటరిగా ఉన్న గుండు నర్సమ్మ మెడలోనుంచి రెండు తులాల పుస్తెల తాడు లాక్కెల్లారు. అదేరాత్రి రామగుండం పాతబజార్‌లో మరోమహిళతో మాట్లాడుతున్న కోల కుసుమ మెడలో నుంచి 45 గ్రాముల పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత బైక్‌ను బల్హార్ష వద్ద వదిలేసి వెళ్లిపోయారు.
మే 29: రైలులో పెద్దపల్లికి చేరుకున్న కపిల్, కాలిరాం.. బస్టాండ్ వద్ద నిలిపిఉన్న పల్సర్‌బైక్ ఎత్తుకెళ్లారు. గోదావరిఖని ఏరియాలో తిరిగినా ఫలితం కనిపించకపోవడంతో బెల్లంపల్లి వద్ద బైక్ పడేసి వెళ్లిపోయారు.
ఆగస్టు 17: మళ్లీ పెద్దపల్లికి చేరిన నిందితులు జూనియర్ కాలేజీ వద్ద పల్సర్‌బైక్ చోరీచేసి పట్టణంలోనే తిరుగుతూ లక్ష్మీనగర్ (చీకురాయిరోడ్డు)లో ఒంటరిగా ఉన్న నూనె స్వరూప మెడలో నుంచి 30 గ్రాముల పుస్తెలతాడు అపహరించుకెళ్లారు. ఆ బైక్‌ను వాంకిడి–బల్హార్ష ప్రాంతంలో పడేశారు.
ప్రత్యేక బృందం ఏర్పాటు
జిల్లాలో వరసగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతుండడాన్ని నియంత్రించేందుకు ఏసీపీ సారథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత ఆధారంగా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నవారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారుగా నిర్ధారించారు. ఇలాంటి నేరాలలో సిద్దహస్తులుగా ఉండే భవారియా తెగకు చెందిన నిందితులుగా గుర్తించారు. నిందితులను పట్టుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై నరేశ్, సీసీఎస్ ఎస్సై నసీర్, హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుళ్లు ప్రభాకర్, విజయ్‌కుమార్, ప్రేమ్‌సాగర్‌ను డీసీపీ, ఏసీపీ అభినందించారు.


