జాతీయ రహదారిపై ట్రయల్ రన్
కొత్తగట్టు కేంద్రంగా
రియల్‌టైం మానిటరింగ్
త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ప్రమాదాల నివారణకు 24 గంటల రియల్ టైం మానిటరింగ్
ప్రతీ కిలోమీటర్‌కు సీసీ కెమెరా, ఎమర్జెన్సీ ఫోన్
అక్టోబర్ నుంచి వాహనాలకు టోల్ వసూలు
కేవలం 40 నిమిషాల్లో వరంగల్ నుంచి కరీంనగర్‌కు
‘సాక్షి’ కథనాలతో దుర్శేడ్ వద్ద వరంగల్ వెళ్లేందుకు ర్యాంప్
ఇబ్బందులు, అభ్యంతరాలు ఉంటే పంపాలంటున్న ఎన్‌హెచ్‌ఏఐ
సాక్షిప్రతినిధి, కరీంనగర్●
జాతీయరహదారి–563 ఇక అందుబాటులోకి రానుంది. వరంగల్– కరీంనగర్ సెక్షన్‌లో 68 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు శనివారం నుంచి ట్రయల్ రన్‌కు అనుమతించారు. అత్యంత ఆధునిక ప్రమాణాలతో ప్రమాదాలు నివారించేలా 24గంటల రియల్‌టైం మానిటరింగ్ ఉండేలా రహదారిని తీర్చిదిద్దారు. ఖమ్మం నుంచి జగిత్యాల వరకు నిర్మించనున్న ఎన్‌హెచ్–563లో భాగంగా కీలకమైన 68కిలోమీటర్ల వరంగల్–కరీంనగర్ సెక్షన్ పనులను రూ.2,486 కోట్లతో పూర్తిచేశారు. మూడేళ్లలో పనులు దాదాపు 95శాతం మేర పూర్తయ్యాయి. వరంగల్ నుంచి దుర్శేడ్ వరకు రోడ్డు పూర్తయినా.. ప్రస్తుతానికి మానకొండూరు సమీపంలోని ఖాదర్‌గూడెం వరకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు దాదాపు రూ.2,000 కోట్లకుపైగా అంచనా వ్యయంతో జగిత్యాల–కరీంనగర్ సెక్షన్ పనులకు ఇటీవల టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం పనుల ప్రారంభోత్సవంతోపాటు ఎన్‌హెచ్–563ని జాతికి అంకితం చేయనున్నారు.
ప్రస్తుతం దుర్శేడ్ వరకు ఎన్‌హెచ్ 563 పనులు పూర్తయ్యాయి. కానీ...పెద్దపల్లి నుంచి వచ్చే వాహనాలకు ఈ రోడ్డు ఎక్కేందుకు ర్యాంప్ నిర్మించలేదు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ఆగస్టు 5వ తేదీన ‘వరంగల్‌కు దారేది?’ అన్న శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ర్యాంపు నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ఈ వారంలోనే అందుబాటులోకి తీసుకువస్తామని ‘సాక్షి’కి తెలిపారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా తమకు వెంటనే సంప్రదించాలని సూచించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా పాత రహదారిని సైతం ఎన్‌హెచ్‌ఏఐ అభివృద్ధి చేసింది. దాదాపు 39 కిమీల మేర రోడ్డుకు మరమ్మతులు నిర్వహించింది. సదాశివపల్లి వద్ద తాత్కాలిక ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటు చేశారు. హసన్‌పర్తి వద్ద ఉన్న ప్రమాదకర మలుపు తీవ్రత తగ్గించారు. చింతగట్టు ఔటర్ రింగ్ రోడ్డు (బీమారం) వద్ద వాటర్ లాగింగ్ ఏరియాను సరిదిద్దుతున్నారు.
● 68 కిలోమీటర్ల పొడవున్న నాలుగులేన్ల రోడ్డును అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. దీనిపై అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను వాడుతున్నారు. కొత్తగట్టు వద్ద టోల్‌ప్లాజా నిర్మించారు. అక్టోబరు ఒకటి నుంచి ఈ మార్గంలో ప్రయాణించేవారికి టోల్ వసూలు చేస్తారు.
● ఈ రోడ్డును 100 కిమీల గరిష్ట వేగంతో వెళ్లేందుకు వీలుగా నిర్మించారు. ప్రతీ కిలోమీటరుకు కుడి, ఎడమవైపులకు సోలార్ సీసీ కెమెరాలు అమర్చారు. కొత్తగట్టులో కమాండ్ కంట్రోల్ రూం నిర్మించారు. అక్కడ నుంచే 24 గంటల రియల్ టైం మానిటరింగ్ చేస్తారు.
● ఈ రోడ్డెక్కిన వాహనం ఏదైనా సరే.. ఎక్కడ ఏ సమయానికి ఎక్కింది? ఎక్కడ దిగింది? ఎక్కడ ప్రమాదం జరిగింది? అనే విషయాలను నిరంతరం గమనిస్తుంటారు. ప్రమాదం జరిగినా, వాహనం నిలిచిపోయినా వెంటనే కొత్తగట్టు కమాండ్ కంట్రోల్ అంబులెన్స్ లేదా టోయింగ్ వాహనాలను పంపి ట్రాఫిక్ క్లియర్ చేస్తారు.
● ప్రతీ కిలోమీటరుకు ఒక ఎమర్జెన్సీ ల్యాండ్ లైన్ ఫోన్ (సేవ్ అవర్ సోల్/ ఎస్‌వోఎస్) ఏర్పాటు చేశారు. దీనిపై ఎలాంటి నంబరు డయల్ చేయనవరసం లేదు. కేవలం ఫోన్ రిసీవర్ ఎత్తగానే నేరుగా కొత్తగట్టు కమాండ్ కంట్రోల్‌కు కాల్ వెళ్లిపోతుంది.
● మితిమీరిన వేగంతో వెళ్లినా, ప్రమాదానికి కారణమైనా, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల నంబర్లు వెంటనే సీసీ కెమెరాలు వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టం (వీఐడీఎస్) ద్వారా పసిగట్టి పోలీసుశాఖకు పంపుతాయి.
● ఇంతకాలం వరంగల్ – కరీంనగర్ మధ్య పాత రహదారి సుమారు 72 కిలోమీటర్లకుపైగా ఉండే ది. తాజా రహదారి మాత్రం 68 కిమీ కావడం గ మనార్హం. వాన నీటిని ఒడిసిపట్టి భూగర్భంలోకి ఇంకేలా రహదారి పొడవునా.. రోడ్డుకు దిగువన ప్రత్యేకంగా ఇంకుడు గుంతలు నిర్మించారు.
● ఎలాంటి పశువులు అడ్డురాకుండా నిర్మించిన ఎలివేటెడ్ హైవే. మధ్యలో మీడియన్ ప్లాంటేషన్ పూర్తయింది. దాదాపు ప్రతీ గ్రామం వద్ద అండర్‌పాస్‌లు, సర్వీసురోడ్లు నిర్మించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. హన్మకొండలోని హంటర్‌రోడ్డులో ఉన్న ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలని అధికారులు స్పష్టంచేశారు.
● మొత్తం ప్రాజెక్టు సమాచారం తెలిపే స్కానర్లు రోడ్డు పొడవునా ఏర్పాటు చేశారు. ఊరుపేర్లు, తరువాత స్టాప్‌లు, రోడ్డు భద్రత, వాహనాల వేగంపై అవగాహన కలిగేలా సైన్ బోర్డులు అమర్చారు.
శనివారం నుంచి వాహనాలకు అనుమతి


