కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని దుకాణ సముదాయాల అద్దె ప్రాతిపదికన వేలం ప్రక్రియ నామ్‌కేవాస్తేగా ముగిసింది. ఒక్కో దుకాణ సముదాయానికి భారీగా పోటీదారులు వస్తారని ఆశించగా, ఇద్దరే పోటీపడి వేలం దక్కించుకొన్నారు. మొత్తం మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లకు అంబేడ్కర్‌స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఐడీఎస్‌ఎంటీ (పాత మున్సిపల్ గెస్ట్ హౌస్) కాంప్లెక్స్‌లను వ్యాపారులు దక్కించుకోగా, పాత పాస్‌పోర్ట్ కార్యాలయ దుకాణ సముదాయానికి స్పందన కరువైంది.
షాపింగ్ కాంప్లెక్స్‌లకు వేలం
అంబేడ్కర్ స్టేడియం స్పోర్ట్ కాంప్లెక్స్, ఐడీఎంఎస్‌టీ కాంప్లెక్స్, పాత పాస్‌పోర్ట్ కార్యాలయం కాంప్లెక్స్‌లను అద్దె ప్రాతిపదికన అప్పగించేందుకు మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో అధికా రులు వేలం నిర్వహించారు. పాత పాస్‌పోర్టుకార్యాలయం దుకాణ సముదాయానికి వ్యాపారులు ముందుకురాలేదు. గతంలో మాదిరిగా దుకాణాల వారీగా కాకుండా, ఈ సారి మొత్తం కాంప్లెక్స్ వేలం నిర్వహించారు. అంబేడ్కర్ స్టేడియం కాంప్లెక్స్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని 19 గదులు, మొదటి అంతస్తులోని హాల్, రెండో అంతస్తులోని రెండు సూట్ రూమ్‌లకు కలిపి నగరపాలకసంస్థ నెలవారీ అద్దెను రూ.9 లక్షల 89 వేల 42గా నిర్ణయించింది. వేలంలో ఇద్దరు మాత్రమే పోటీ పడగా రమేశ్ అనే వ్యాపారి రూ.9.94 లక్షలకు దక్కించుకున్నాడు. ఐడీఎస్‌ఎంటీ కాంప్లెక్స్‌లో సెల్లార్ పార్కింగ్, పైన 25 దుకాణాలకు గాను నగరపాలకసంస్థ రూ.6 లక్షల 1 వేయి 20గా నిర్ణయించింది. ఇద్దరు వ్యాపారులు పోటీపడగా జంగిలి సతీశ్ రూ.6.10లక్షలకు దక్కించుకొన్నాడు. నగరపాలకసంస్థ నిర్ణయించినరేట్లకు కేవలం రూ.5 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే ఎక్కువ రావడం గమనార్హం. వేలంలో స్పందనరాని పాత పాస్‌పోర్టుకార్యాలయ సముదాయానికి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.


