తిమ్మాపూర్: పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. నేరస్తుల రికార్డులు, క్రైం రికార్డులు, సీజ్ చేసిన ప్రాపర్టీ, స్టేషన్ నిర్వహణ, పరిసరాలను పరిశీలించి సీఐ, ఎస్సై, సిబ్బందిని సీపీ అభినందించారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. గతంతో పోలిస్తే ఈ ఏడా ది జిల్లాలో 4శాతం నేరాలు తగ్గాయన్నారు. జనాభా తక్కువగా ఉన్న దృష్ట్యా ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్ అప్‌గ్రేడ్ ప్రతిపాదన లేదన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ మూడుకు పైగా కేసులు ఉంటే హిస్టరీషీట్స్ తెరుస్తున్నామని తెలిపారు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎల్‌ఎండీ ఎస్సై అన్వర్ పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, నేటినుంచి 8వ తేదీ వరకు కాంగ్రెస్ పాలనపై సమర శంఖం పూరిస్తున్నామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ నేడు తెలంగాణ చౌక్‌లో 420 అడుగుల ఫ్లెక్సీతో మానవహారం, ‘బాకీ కార్డుల’ పంపిణీ చేపడతామన్నారు. 3న 22ఏ బాధితులతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని, హరీశ్‌రావు హాజ రవుతారని తెలిపారు. 4న వృద్ధులు, దివ్యాంగుల సమస్యలపై ఆందోళన, 5న విద్యార్థులు, యువతతో ర్యాలీ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారన్నారు. 6న వార్డులు, గ్రామపంచాయతీల్లో స్థానిక సమస్యలపై నిరసనలు, 7న ప్రజావాణిలో వినతిపత్రాలు, 8న అంబేద్కర్ విగ్రహాల వద్ద అర్జీలు సమర్పిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కొండూరు రవీందర్‌రావు, నారదాసు లక్ష్మణరావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, కాసారపు శ్రీనివాస్‌గౌడ్, సర్దార్ రవీందర్‌సింగ్ పాల్గొన్నారు.
హలో.. ఏసీబీ హెడ్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా..
కరీంనగర్ కార్పొరేషన్: ‘హలో నేను ఏసీబీ హెడ్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా. నువ్వు బాగా ఆస్తులు సంపాదించావట కదా. నీ మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి. నిన్ను కలవాలే. ఎక్కడున్నవ్.. ఆఫీసుకు రా..’ అంటూ వచ్చిన ఓ ఫోన్‌కాల్ నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ అధికారులను వణికించింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ ఫోన్ 11 గంటల వరకు ఏఈలు, డీఈలు, ఈఈకి వరుసగా రావడంతో బెంబేలెత్తిపోయారు. ఇటీవలనే టౌన్‌ప్లానింగ్‌విభాగంలో ఏసీబీ సో దాలు నిర్వహించడంతో, ఏసీబీ పేరిట వచ్చిన ఫోన్ కాల్ చర్చనీయాంశంగా మారింది. అందరికీ ఒకే నెంబర్ నుంచి ఫోన్ రావడం, అందరిని కలవాలంటూ ఆఫీసుకు రమ్మనడంపై అధికారుల్లో అనుమానం మొదలైంది. కార్యాలయానికి వచ్చిన తరువాత కాల్ చేస్తే ఆ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. కొంతమంది ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ట్రూకాలర్‌లో ఏపీలోని అనంతపురంకు చెందిన నాయిడు అనే వ్యక్తి పేరు కనిపించడంతో, ఫేక్ కాల్‌గా భావించిన ఊపిరిపీల్చుకున్నారు.
కార్పొరేట్లకు కేంద్రం పెద్దపీట
కరీంనగర్‌టౌన్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం కరీంనగర్‌లోని బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో మాట్లాడుతూ బ్యాంకుల నుంచి తీసుకున్న సుమారు రూ.22 వేల కోట్ల రుణాలను కార్పొరేట్ వర్గాలకు మాఫీ చేసిన పాలకులు.. పేదలు, రైతుల అప్పుల విషయంలో పట్టించుకోవడం లేదన్నారు. సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు కరీంనగర్‌లో నిర్వహించే ఏఐటీయూసీ మహాసభలను విజయవంతం చేయాలన్నారు.


