కాంగ్రెస్‌లో రూరల్‌ పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో రూరల్‌ పంచాయితీ

Sep 4 2026 7:53 AM | Updated on Sep 4 2026 7:53 AM

కరీంనగర్‌, కొత్తపల్లి మండల అధ్యక్ష పదవులపై పట్టు

మరోసారి వైరి వర్గాల ఆధిపత్య పోరు

డీసీసీ కార్యాలయంలో పీసీసీ పరిశీలకుల అభిప్రాయ సేకరణ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కాంగ్రెస్‌లో మరోసారి పార్టీ పదవుల పంచాయితీ తారాస్థాయికి చేరింది. కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి మండలాల అధ్యక్షుల ఎన్నిక వేదికగా వైరి వర్గాలు మరోసారి తలపడుతున్నా యి. రెండేసి పేర్లు అధిష్టానం వద్దకు చేరగా, రెండింటిలో ఒకటి సెలెక్ట్‌ చేసేందుకు పీసీసీ పరిశీలకులు మంగళవారం అభిప్రాయ సేకరణ చేపట్టారు.

పీసీసీ పరిశీలకుల అభిప్రాయ సేకరణ

కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుల ఎన్నిక కోసం పీసీసీ పరిశీలకులు కూన శ్రీశైలం గౌడ్‌, ఫక్రుద్దీన్లు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో డీసీసీ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ముందుగా కొత్తపల్లి మండల సమావేశం నిర్వహించారు. అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకొన్న ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడారు. బోనాల అశోక్‌, పెంట శేఖర్‌ పోటీపడుతుండగా, ఎవరికి అవకాశం ఇవ్వాలంటూ ఆరా తీశారు. ఆరుగురు గ్రామశాఖ అధ్యక్షులు శేఖర్‌ పేరు చెప్పినట్లు సమాచారం. అనంతరం కరీంనగర్‌ రూరల్‌ సమావేశం వాడీవేడిగా సాగినట్లు తెలిసింది. ఇటీవల మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లుగా బీఆర్‌ఎస్‌, బీజేపీ వాళ్లను నియమించారని, ఇప్పుడు అలా చేస్తామంటే కుదరదని మండల నాయకులు, గ్రామశాఖల అధ్యక్షులు పరిశీలకులకు తెగేసి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం అధ్యక్ష స్థానానికి అశోక్‌రెడ్డి, నరేశ్‌రెడ్డిల్లో ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆశావహులను వ్యక్తిగతంగా ఆరా తీశారు.

వెలిచాల వర్సెస్‌ అదర్స్‌

కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి మండల అధ్యక్ష స్థానాల ఎన్నికలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ఒక వైపు, ఇతర నాయకులు మరోవైపు ఉండడంతో పార్టీలో మరోసారి వర్గపోరు తెరపైకి వచ్చింది. కరీంనగర్‌ రూరల్‌కు అశోక్‌రెడ్డి, కొత్తపల్లి అశోక్‌ను వెలిచాల ప్రతిపాదించగా, నరేశ్‌రెడ్డి, పెంట శేఖర్‌కు సుడా మాజీచైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్‌ కార్పొరేషన్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, ఇతర నాయకులు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. అభిప్రాయ సేకరణ అనంతరం అందే నివేదిక మేరకు పార్టీ అధిష్టానం తీసుకొనే నిర్ణయంపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

కష్టపడ్డ కార్యకర్తలకే పట్టం

పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకే అధ్యక్ష పీఠాలు దక్కుతాయని పీసీసీ పరిశీలకులు కూన శ్రీశైలం గౌడ్‌, ఫక్రుద్దీన్‌ అన్నారు. డీసీసీ కార్యాలయంలో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ అసలైన కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పీసీసీ తమను పరిశీలకులుగా పంపించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement