సింగ్‌ vs సునీల్‌ | - | Sakshi
Sakshi News home page

సింగ్‌ vs సునీల్‌

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

సింగ్‌ vs సునీల్‌

సమస్యలు పరిష్కరించాలి

వాడీవేడిగా బల్దియా కౌన్సిల్‌ మీటింగ్‌

మాజీ మేయర్ల మధ్య మాటల యుద్ధం

ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నం

తీవ్ర ఉద్రిక్తత.. అడ్డుకున్న సభ్యులు

ఎంహెచ్‌ సుమన్‌ను సరెండర్‌ చేయాలి

పలువురు కార్పొరేటర్ల డిమాండ్‌

ఎంహెచ్‌వోను సరెండర్‌ చేయాలి

సమగ్రాభివృద్ధికి చర్యలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌:

‘అరేయ్‌.. ఒరేయ్‌.. ఏందిరా.. కొడుకా.. నీ..’ మాటలతో కరీంనగర్‌ బల్దియా కౌన్సిల్‌ మీటింగ్‌ దద్దరిల్లింది. కార్పొరేటర్లుగా ఉన్న మాజీ మేయర్లు ఇద్దరు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగడం, ఒక దశలో ఒకరిపై మరొకరు దాడి చేసుకోనే స్థాయికి పరిస్థితి చేరడంతో కౌన్సిల్‌ నివ్వెరపోయింది. మాజీ మేయర్‌ ప్రస్తుత డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, మాజీ మేయర్‌, ప్రస్తుత 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ మధ్య మాటల యుద్ధం చినికిచినికి గాలివానగా మారింది. అర్హత లేని, అవినీతికి పా ల్పడుతున్న ఎంహెచ్‌ సుమన్‌ను సరెండర్‌ చేయాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 3.40 గంటలకు ముగిసింది.

నువ్వంటే.. నువ్వే..

సర్వసభ్య సమావేశంలో గత స్మార్ట్‌సిటీ కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ఆర్‌వీ కన్సల్టెన్సీకి యూసీఎఫ్‌ డీపీఆర్‌ తయారీని అప్పగిస్తూ, ఏజెన్సీ గడువు పొడిగిస్తూ చేసిన తీర్మానంపై రవీందర్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కన్సల్టెన్సీ సక్రమంగా పనిచేయలేదని, మళ్లీ యూసీఎఫ్‌ డీపీఆర్‌ ఎలా అప్పగిస్తాన ని ప్రశ్నించారు. దీనిపై తాను డీసెంట్‌ నోటీస్‌ ఇస్తారన్నారు. ‘డీసెంట్‌ నోటీసు ఇస్తానంటున్నాడు కదా ఇంకా చర్చ ఎందుకు’ అంటూ సునీల్‌రావు జోక్యం చేసుకోవడంతో ‘నువ్వెవరు మధ్యలో చెప్పడానికి’ అంటూ రవీందర్‌సింగ్‌ అనడంతో వివాదం మొదలైంది. నువ్వు అని ఏకవచనంతో ఎలా సంబోధిస్తావంటూ సునీల్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరినొకరు తీవ్రస్థాయిలో దూషించుకున్నారు. సునీల్‌రావు రవీందర్‌ సింగ్‌ వైపు దూసుకురావడంతో కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ అంజన్‌కుమార్‌ తదితరులు అడ్డుకున్నారు. ఉద్రిక్తత మధ్య సభను ముగించారు.

లేబర్‌ జాకెట్‌తో నిరసన

శానిటేషన్‌ అక్రమాలను నిరసిస్తూ కార్పొరేటర్‌ రవీందర్‌సింగ్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శానిటేషన్‌ కార్మికుల జాకెట్‌ను ధరించి సభకు హాజరయ్యారు. కార్మికులకు ఇవ్వాల్సిన వస్తువుల్లోనూ శానిటేషన్‌ అధికారులు అక్రమాలకు పాల్ప డుతున్నారని ఆరోపించారు.

ఆదర్శనగర్‌లోని ఖాళీ స్థలాల్లో చెత్త, చికెన్‌ వ్యర్థాలు వేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌కుమార్‌ అన్నారు. స్మార్ట్‌ సిటీ లైట్లు వెలిగేలా చూడాలని, వీఽధికుక్కల బెడదను నివారించాలన్నారు.

రవీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం అధ్వానంగా మారిందని, కుక్కలు, కోతుల సమస్య పరిష్కరించాలన్నారు. టౌన్‌ప్లానింగ్‌ అక్రమాలను అరికట్టాలన్నారు.

డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ సభ్యుల కోరిక మేరకు ప్రతి డివిజన్‌కు ఇద్దరు చొప్పున శానిటేషన్‌ కార్మికులను తీసుకోవాలని సూచించారు.

7వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆకుల నందిని మాట్లాడుతూ అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హౌసింగ్‌బోర్డుకాలనీ, సదాశివపల్లి రెండు ప్రాంతాలు తమ డివిజన్‌లో ఉండడంతో శానిటేషన్‌ పరంగా ఇబ్బందవుతుందని, అదనంగా కార్మికులను కేటాయించాలన్నారు.

గుగ్గిళ్ల జయశ్రీ మాట్లాడుతూ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కొంతమంది నిర్మాణాలు కూల్చివేస్తున్నారన్నారు.

గంట శ్రీనివాస్‌ మాట్లాడుతూ సుభాష్‌నగర్‌ రోడ్డును వెడల్పు చేయాలన్నారు. కొలిపాక రమ్య మాట్లాడుతూ కమాన్‌చౌరస్తా వద్ద దారి మూసివేయడంతో వన్‌వేతో ట్రాఫిక్‌ జాం అవుతోందని, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. గణేష్‌నగర్‌ బైపాస్‌లో స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.

పెద్దపల్లి శ్రీలేఖ మాట్లాడుతూ భాగ్యనగర్‌ సాయిబాబా టెంపుల్‌ ప్రాంతంలో నల్లా నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. మాతా శిశు హాస్పిటల్‌ వద్ద మూలమలుపులో ఫుట్‌పాత్‌ను పూర్తిగా మూసివేయడం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందవుతోందన్నారు. ప్రభుత్వ స్థలాలు కాపాడాలని బోయినపల్లి ప్రవీణ్‌రావు అన్నారు.

అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (ఎంహెచ్‌వో) సుమన్‌ను సరెండర్‌ చేయాలని కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ మాట్లాడుతూ ఎంహెచ్‌వోగా అర్హత లేకున్నా సుమన్‌ను నియమించారని, హోదాలేకున్నా అద్దెకారుకు ఏడాదిగా నెలకు రూ.33 వేలు చెల్లించారని విమర్శించారు. అటెండర్‌, డ్రైవర్‌ను వినియోగించుకుంటూ, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రవీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ విద్యానగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో మిడ్‌లెవెల్‌హెల్త్‌ ప్రొవైడర్‌ సుమన్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఎంహెచ్‌వోగా నియమించారన్నారు. చీపుర్లు, చెప్పులు, ఆయిల్‌ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రిటైర్డయిన కార్మికుడి జీతం తీసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌కుమార్‌ ఎంహెచ్‌వో సుమన్‌ను సరెండర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అయి ఓచర్లపై సంతకాలు పెడుతున్నాడని, గెజిటెడ్‌ హోదాలో గ్రీన్‌పెన్‌ వాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని ప్రకటించారు. రోడ్లపై ప్యాచ్‌వర్క్‌లకు రూ.కోటితో పనులు చేపడుతున్నామన్నారు. 66 డివిజన్లలో రూ.1.30 కోట్ల వ్యయంతో ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. విలీన గ్రామాల్లో నల్లా కనెక్షన్లు రూ.400తోనే రెగ్యులరైజ్‌ చేయనున్నట్లు తెలిపారు. వీధికుక్కల బెడద నివారణకు ప్రతి నెల 400 కుక్కలకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించామన్నారు. రహదారులు, జంక్షన్ల గ్రీనరీ నిర్వహణకు అక్కడే బోర్‌వెల్స్‌ వేసి డ్రిప్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద రూ.17 కోట్లు, స్మార్ట్‌సిటీ నుంచి రూ.8 కోట్లతో డంప్‌యార్డ్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. ఈ సమావేశంలో కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement