‘విక్రేత’ వరకు వెళ్లకపోతే సమస్యకు పరిష్కారం ఎక్కడ?
తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి
గంజాయి విక్రయించే అసలు వ్యక్తులు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మైనర్లను చిన్నచిన్న సరఫరాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తక్కువ వయసు కావడం, పోలీసులకు పట్టుబడితే కేసు తీవ్రత తక్కువగా ఉంటుందన్న భావనతో కొందరు ముఠాలు బాలలను వలలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. మొదట ‘ఒక్కసారి ప్రయత్నించు’ అంటూ పరిచయం, తర్వాత ఉచితంగా లేదా తక్కువ ధరకు గంజాయి ఇవ్వడం, అలవాటు పడిన తర్వాత డబ్బు వసూలు చేయడం.. చివరకు అదే విద్యార్థితో ఇతరులకు సరఫరా చేయించడం.. ఇలా మత్తు వ్యాపారం చాపకింద నీరులా విస్తరిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కిలోల కొద్దీ మత్తు విద్యార్థుల చేతుల్లోకి!
గంజాయి రవాణా, విక్రయాలపై పోలీసులు దాడులు చేస్తుండగా.. పట్టుబడుతున్న గంజాయి పరిమాణం చూస్తే జిల్లాలో మత్తు పదార్థాల సరఫరా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఒకవైపు వందల కేసులు.. మరోవైపు వందలాది అరెస్టులు.. కిలోల కొద్దీ గంజాయి స్వాధీనం. అయినా గంజాయి అందుబాటులోకి వస్తుండడమే అసలు సమస్య. 2025లో 291 కిలోలు, 2026 జూలై వరకు 157 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ శాతం ఇందులో విద్యార్థులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
గంజాయి వినియోగిస్తున్న మైనర్‌ను బాధితుడిగానూ, నేరంలో భాగస్వామిగా మారే ప్రమాదంలో ఉన్న బాలుడిగానూ చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అతడిని మత్తుకు బానిస చేసిన సరఫరా వ్యవస్థను ఛేదించకపోతే ఒక విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి ఆ వలలో పడే ప్రమాదం ఉంది. అందుకే జిల్లాల వారీగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, విద్యార్థులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలపై నిఘా పెంచడంతో పాటు గంజాయి సరఫరా మూలాలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు అవసరం.
విద్యార్థి ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, చదువుపై ఆసక్తి తగ్గడం, కొత్త స్నేహితుల పరిచయం, తరచూ డబ్బు అడగడం, ఇంటికి ఆలస్యంగా రావడం వంటి అంశాలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు. అనుమానం వచ్చిన వెంటనే పిల్లలను శిక్షించడం కంటే వారి సమస్యను అర్థం చేసుకుని అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవడం కీలకం. నల్లగొండ ఘటన ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు.. మైనర్లను మత్తు వలలోకి లాగుతున్న వ్యవస్థకు ప్రమాద ఘంటిక. ఇప్పటికై నా ప్రతీ జిల్లాలో ‘మైనర్లకు గంజాయి ఎలా చేరుతోంది?’ అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం పోలీసులకు ఉంది.


