సాక్షిప్రతినిధి, కరీంనగర్:
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో గురువారం ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు సమావేశం కానున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దక్షిణ మధ్య రైల్వే జీఎంతో సమావేశం కానున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం సాగుతున్న పనుల వేగవంతం, కొత్త ప్రాజెక్టులు, పలు రైల్వేస్టేషన్ల అభివృద్ధి, ఆర్వోబీల నిర్మాణం వేగవంతం, కొత్త వాటికి ప్రతిపాదనలు, కొత్త రైళ్ల కోసం వినతులపై ఎంపీలు ఇప్పటికే జీఎంకు పలు ప్రశ్నలు పంపించారు. ఆయా ప్రతిపాదనలు, వినతులపై జీఎం సమాధానం ఇవ్వనున్నారు. ఈ ప్రతిపాదనల్లో కరీంనగర్ నుంచి కొత్తపల్లి మనోహరాబాద్ రైలు ప్రాజెక్టు, తీగలగుట్టపల్లి ఆర్వోబీ వేగవంతం, పెద్దపల్లి – నిజామాబాద్ డబ్లింగ్, తిరుపతి కరీంనగర్ బై వీక్లీ ఎక్స్‌టెన్షన్, నిజామాబాద్ – కాజీపేట – వయా పెద్దపల్లి డెమూ కోసం వినతి, విశాఖపట్నం – సాయినగర్ – షిరిడీ వయా కాజీపేట– పెద్దపల్లి – నిజామాబాద్ మీదుగా నడపాలని వినతి, తెలంగాణ సూపర్‌ఫాస్ట్ సంపర్క్‌క్రాంతి – హరిద్వార్ సికింద్రాబాద్ నిజామాబాద్ – కరీంనగర్ మీదుగా కొత్త రైలు, కాచీగూడ – కరీంనగర్ మెమూ రైలు పెద్దపల్లి వరకు పొడిగింపు, లింగంపేట – జగిత్యాల రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారాల ఎక్స్‌టెన్షన్, జగిత్యాల అమృత్‌భారత్ కింద అభివృద్ధి చేయాలని తదితరాలు ఉన్నాయని సమాచారం. ఈ ప్రతిపాదనలు, విజ్ఞప్తులను ఎంపీలు ఇప్పటికే రైల్వే జీఎంకు అందజేశారు. వీటిపై ఇప్పటికే సమాధానాలు సిద్ధం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే ఎంపీలకు ఇవ్వనున్నారు. అంతేకాకుండా పలు ఇతర రైల్వే ప్రాజెక్టులపైనా ఎంపీలు చర్చించనున్నారు.


