● మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన లక్ష్యమని అందులో భాగంగానే పల్లెపల్లెకు పొన్నం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం మండలంలోని దుద్దెనపల్లి, ఎగ్లాస్‌పూర్, సోమారం, గర్రెపల్లి, లస్మన్నపల్లి, వెన్నంపల్లి, ఆరెపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. మిడ్‌మానేర్ కుడి కాలువ, గౌరవెళ్ళి ప్రాజెక్టుల ద్వారా సైదాపూర్ మండలాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. రైతులకు యూరియా ఇబ్బందులు రాకుండా చూడాలని వ్యసాయాధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక ఆదాయం కోసం ఆయిల్‌ఫాం సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. ఎగ్లాస్‌పూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా భవనం, ఆరెపల్లిలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్‌డీవో గీత, మార్కెట్ చైర్మన్ దొంత సుధాకర్, విండో చైర్మన్లు తిరుపతిరెడ్డి, వెంకటరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో యాదగిరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చాడ కొండాల్‌రెడ్డి, సీనియర్ నాయకుడు గుండారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘ఫీజుల బకాయి– బీజేపీ లడాయి’
కరీంనగర్: బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం చేపట్టనున్న ‘ఫీజుల బకాయి– బీజేపీ లడాయి’, ‘స్టూడెంట్ మార్చ్’ ఏర్పాట్లను బుధవారం బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కరీంనగర్‌లో తలపెట్టిన భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేశ్ హాజరవుతారని పేర్కొన్నారు.
క్వింటాల్ పత్తి ధర రూ.9,100
జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.9,100, కనిష్ట ధర రూ.8,700 పలికింది. క్రయవిక్రయాలను కార్యదర్శులు మల్లేశం, రాజా పర్యవేక్షించారు.


