టౌన్‌ ప్లానింగ్‌లో దళారుల దందా! | - | Sakshi
Sakshi News home page

టౌన్‌ ప్లానింగ్‌లో దళారుల దందా!

Aug 20 2026 3:40 AM | Updated on Aug 20 2026 3:40 AM

● కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు ● అవకతవకలపై ఆరా

కరీంనగర్‌క్రైౖం: కరీంనగర్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగింది. మంగళవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పలు అవకతవకలు, లోపాలు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రజల పనులు చేయిస్తామంటూ అనధికార మధ్యవర్తులు రంగంలోకి దిగి డబ్బులు వసూలు చేస్తున్నారన్న సంకేతాలు ఏసీబీ తనిఖీల్లో బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏసీబీ కరీంనగర్‌ రేంజ్‌ అధికారులు టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, అధికారుల పర్యవేక్షణ, ఆదాయ వసూళ్లపై నిఘా, దరఖాస్తుల పరిష్కారం–పెండెన్సీ, క్షేత్రస్థాయి విచారణల్లో జవాబుదారీతనం వంటి అంశాల్లో లోపాలను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.

అధికారిక ఖాతాల వినియోగంపై ప్రశ్నలు

టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన అధికారిక యూజర్‌ క్రెడెన్షియల్స్‌ వినియోగం విషయంలోనూ ఏసీబీ అధికారులు లోపాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు సమాచారం అందించడం, వారి దరఖాస్తులపై మార్గదర్శకత్వం ఇవ్వడంలో కూడా కొన్ని లోపాలు ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. దీంతో అసలు దరఖాస్తుదారుల పనులు ఏ స్థాయిలో ఉన్నాయి? వాటి పరిష్కారంలో ఎవరి పాత్ర ఎంత? అనే అంశాలపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

‘పని చేయిస్తాం’ అంటూ వసూళ్లు?

ఏసీబీ తనిఖీల్లో అత్యంత కీలకంగా వెలుగుచూసిన అంశం అనధికార మధ్యవర్తుల వ్యవహారం. అధికారిక పనులు చేయిస్తామంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు మధ్యవర్తుల ఉనికిపై ఏసీబీకి సంకేతాలు లభించినట్లు ప్రకటనలో పేర్కొంది. దీనిపై మరింత ధ్రువీకరణ కొనసాగుతోందని స్పష్టం చేసింది. దీంతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో దళారుల పాత్ర ఎంతవరకు ఉంది? ఎవరి అండతో వారు కార్యాలయంలో చక్రం తిప్పుతున్నారు? ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్ము ఎవరికి చేరుతోంది? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ప్రభుత్వానికి నివేదిక

ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన అంశాలపై ఏసీబీ అధికారులు సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. వివరణాత్మక పరిశీలన పూర్తయిన అనంతరం, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, పలు అంశాల్లో లోపాలను గుర్తించడం కార్పొరేషన్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పూర్తి స్థాయి నివేదిక బయటకు వస్తే మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement