కలగానే ఫారిన్ చదువులు
ఔత్సాహికులు ఎందరో.. కొందరికే ఓవర్సిస్ విద్యాపథకం
రాష్ట్రస్థాయిలో టార్గెట్లతో నిర్వహిస్తున్న ఎంపికలే కారణం
పదేళ్లలో జిల్లా నుంచి 177 మంది విద్యార్థులకే లబ్ధి
అందని ద్రాక్ష..
కరీంనగర్‌టౌన్: ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునే కలను నెరవేర్చేందుకు ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకం లక్ష్యం నీరుగారుతోంది. రాష్ట్రస్థాయిలో టార్గెట్లు పెట్టి ఎంపిక చేస్తుండడంతో జిల్లా నుంచి ఎక్కువ మంది లబ్ధిపొందలేక పోతున్నారు. ఉన్నత చదువులకు జిల్లా నుంచి ఎవరికి వారే సొంతంగా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్, పిలిప్పీన్స్, కెనడా, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణకొరియా తది తర దేశాలకు వెళ్తుండగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో వెళ్లేవారి సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఒక్కోపేరుతో ఈ విదేశీ విద్యాపథకాన్ని అమలు చేస్తోంది. తల్లిదండ్రుల వార్షికాదా యం రూ.5 లక్షల లోపు ఉండి చదువులో ప్రతిభ చూపేవారు ఈ పథకానికి అర్హులు. రాష్ట్రస్థాయిలో నిధుల కేటాయింపు మేరకు కమిషనరేట్‌స్థాయిలో ఉన్న టార్గెట్లను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేస్తున్నారు. దీంతో పైచదువులకు జిల్లానుంచి విదేశాల కు వెళ్లాలనే వారి ఆశలు ఆడియాశలవుతున్నాయి.
ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం రూ.20 లక్షలు అందిస్తోంది. ఈ సాయంతో విదేశీ యూనివర్సిటీల్లో ఎంఎస్, పీహెచ్‌డీతో పాటు ఇతర ఉన్నత విద్య చదివే అవకాశముంది. ఎస్సీ, ఎస్టీలకు బీఆర్.అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం, బీసీ, ఈబీసీ విద్యార్థులకు మహాత్మజ్యోతిరావు పూలే ఓవర్సీస్ విద్యా పథకం పేరిట 2013 నుంచి అమల్లో ఉండగా.. మొదట్లో రూ.10లక్షలు సాయం అందించారు. 2015 నుంచి రూ.20 లక్షలకు పెంచారు. ఇంజినీరింగ్‌తో పాటు డిగ్రీలో కనీసం 60శాతం మార్కులుపైబడి ఉండి, టోఫెల్‌లో 60, ఐఈఎల్‌టీలో 60, జీఆర్‌ఈలో 260, జిమాట్‌లో 500 మార్కులు వచ్చి ఉండాలి. దరఖాస్తుదారుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికై న విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీల్లో ఫీజుల నిమిత్తం ఈ సొమ్మును చెల్లిస్తారు. ఆయా యూనివర్సిటీల్లో ఫీజు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం రూ.20లక్షలు మాత్రమే అందిస్తుంది.


