కరీంనగర్ అర్బన్: పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, అదనపు డీసీపీ వెంకటరమణతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రొటోకాల్ సమస్య తలెత్తకూడదన్నారు. వేదిక వద్ద సీటింగ్, తాగునీరు సౌకర్యాలు కల్పించాలన్నారు. దేశభక్తి పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం కురిసినా కార్యక్రమానికి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. స్టాల్స్, శకటాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యవసాయశాఖ, గృహనిర్మాణశాఖ, ఆర్టీసీ, వైద్యశాఖ, పంచాయతీరాజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖల పనితీరు తెలిసేలా శకటాలు ఏర్పాటు చేయించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల శకటం, డ్రగ్స్ నియంత్రణకు పోలీస్‌శాఖ తీసుకుంటున్న చర్యలతో శకటం ఏర్పాటు చేయాలన్నారు. ప్రశంసాపత్రాలు అందించేందుకు ఉత్తమ పనితీరు కనబరిచే ఉద్యోగులను ఎంపిక చేయాలని సూచించారు.
సమన్వయంతో యూనిఫామ్ పంపిణీ
కరీంనగర్ టౌన్: అన్నిశాఖల అధికారుల సమన్వయంతో విద్యార్థుల యూనిఫామ్ పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. డీఆర్డీఏ, మెప్మా, విద్యాశాఖ సమన్వయంతో యూనిఫామ్ పంపిణీ పూర్తి చేయాలన్నారు. ‘అపార్’ నమోదు వేగవంతం చేయాలన్నారు. ఆధార్‌లో పొరపాట్లతో రిజిస్ట్రేషన్ ఆలస్యమైతే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, ఈ బాధ్యతను హెచ్‌ఎంలు తీసుకోవాలన్నారు. 95శాతం విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఈవో చైతన్య జైనీ, డి.ప్రశాంత్‌రెడ్డి, కో ఆర్డినేటర్లు అశోక్‌రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.


