డ్రంకెన్‌ డ్రైవ్‌లోడూప్లికేట్లు | - | Sakshi
Sakshi News home page

డ్రంకెన్‌ డ్రైవ్‌లోడూప్లికేట్లు

Jul 13 2026 5:54 AM | Updated on Jul 13 2026 5:54 AM

డబ్బిస్తే అసలు నిందితుడికి అభయం.. కోర్టుకు మరొకరు? రూ.15వేల నుంచి రూ.30వేల వరకు వసూళ్ల ఆరోపణలు ఫేక్‌ చలాన్లు.. డూప్లికేట్‌ వ్యక్తులు కోర్టునే తప్పుదోవ పట్టించారా? రోడ్డు భద్రత పేరుతో కేసులు.. తెరవెనుక ‘సెటిల్‌మెంట్‌’ దందా కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌.. ఆర్‌ఎస్సై, మరో కానిస్టేబుల్‌పై విచారణ తీగ లాగితే డొంక కదులుతోందా? వెనుక ఉన్నదెవరో తేల్చాల్సిందే..

కరీంనగర్‌క్రైం: మద్యం తాగి వాహనం నడిపితే చట్టం ముందు నిలబడాల్సిందే. ప్రమాదాలకు కారణమయ్యే డ్రంకెన్‌ డ్రైవ్‌ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, అదే చట్టాన్ని అమలు చేయాల్సిన కొందరు సిబ్బంది.. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులనే ‘ఆదాయ వనరు’గా మార్చుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు కరీంనగర్‌ పోలీసుశాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. డబ్బులు చెల్లిస్తే అసలు నిందితుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదా? అతడి స్థానంలో మరొకరిని నిలబెట్టారా? ఫేక్‌ చలాన్లతో రికార్డులను తారుమారు చేశారా? ఒక్కో కేసుకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేశారా? ఈ వ్యవహారం ఎంతకాలంగా సాగుతోంది? దీనివెనుక కేవలం ముగ్గురు సిబ్బందే ఉన్నారా.. లేక మరింత పెద్ద నెట్‌వర్క్‌ పనిచేసిందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రైటర్‌.. కోర్టు డ్యూటీ..

కీలక లింక్‌

స్టేషన్‌లో కేసుల రికార్డులు నిర్వహించే స్థాయి నుంచి కోర్టుకు కేసులను తీసుకెళ్లే ప్రక్రియ వరకు పరస్పర సహకారం లేకుండా ఇలాంటి వ్యవహారం సాగడం సాధ్యమేనా అనే ప్రశ్న పోలీసు వర్గాల్లోనే వినిపిస్తోంది. స్టేషన్‌ రికార్డులు, కేసు పత్రాలు, కోర్టు హాజరు ప్రక్రియలో ఎక్కడెక్కడ మార్పులు జరిగాయో విచారణ కమిటీ నిగ్గుతేల్చాల్సి ఉంది. కేవలం కింది స్థాయి సిబ్బందితోనే ఇంతటి వ్యవహారం జరిగిందా లేక మరెవరైనా సహకరించారా? ఎవరి అండతో ఈ దందా సాగింది? అనే కోణంలోనూ విచారణ జరగాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

జైలు భయమే పెట్టుబడిగా..

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడిన కొందరు వాహనదారులకు కోర్టుకు వెళ్తే జైలు శిక్ష పడుతుందనే భయం ఉంటుంది. ఇదే భయాన్ని కొందరు సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు నుంచి సులభంగా బయటపడే మార్గం చూపిస్తామంటూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. సాధారణంగా డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తే చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కోవాలి. అయితే డబ్బులు చెల్లించిన వారి స్థానంలో ‘డూప్లికేట్‌’ వ్యక్తులను కోర్టుకు పంపించారనే ఆరోపణలు అత్యంత తీవ్రమైనవిగా మారాయి. ఇదే నిజమైతే ఇది కేవలం అవినీతి వ్యవహారంతో ముగిసిపోయే అంశం కాదని, న్యాయ ప్రక్రియనే తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఫేక్‌ చలాన్ల వెనుక

కథేంటి..?

ఈ వ్యవహారంలో ‘ఫేక్‌ చలాన్లు’ ఉపయోగించారనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. చలాన్లు నిజమైనవా? వాటిలో నమోదైన వివరాలు ఎవరివి, ప్రభుత్వ ఖాతా లో ఎంత మొత్తం జమైంది, వాహనదారుల నుంచి వాస్తవంగా ఎంత వసూలైంది? మధ్యలో ఎంత మొత్తం చేతులు మారింది? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వాహనదారుడి నుంచి రూ.15 వేలు లేదా రూ.30 వేలు తీసుకుని.. ప్రభుత్వానికి మాత్రం జరిమానా పేరుతో తక్కువ మొత్తం చెల్లించారా.. లేక అసలు చలాన్లనే తారుమారు చేశారా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.

‘డూప్లికేట్‌’ వ్యక్తులు

ఎక్కడి నుంచి వచ్చారు?

అసలు నిందితుల స్థానంలో ఇతర వ్యక్తులను కోర్టుకు పంపించారనే ఆరోపణలు నిజమైతే.. ఆ డూప్లికేట్‌ వ్యక్తులు ఎవరు? వారిని ఎవరు సమకూర్చారు? ఒక్కోసారి కోర్టుకు హాజరైనందుకు వారికి ఎంత చెల్లించారు? ఒకే వ్యక్తి అనేక కేసుల్లో హాజరయ్యాడా? వారి గుర్తింపు పత్రాలు ఎలా చూపించారు? కోర్టు రికార్డుల్లో ఎవరి పేర్లు నమోదయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల తేదీలు, వాహనదారుల వివరాలు, బ్రీత్‌ అనలైజర్‌ రికార్డులు, ఫొటోలు, వీడియోలు, కోర్టుకు హాజరైన వ్యక్తుల వివరాలను సరిపోల్చితే అసలు వ్యవహారం బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌తో ఈ వ్యవహారం ముగిసిపోకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరోపణలు నిజమైతే.. ఎంతకాలంగా ఈ వ్యవహారం సాగింది, మొత్తం ఎన్ని డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో అక్రమాలు జరిగాయి..ఎంత డబ్బు చేతులు మారింది? డూప్లికేట్‌ వ్యక్తులు ఎంతమంది, ఫేక్‌ చలాన్లు ఎన్ని? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి పాత్ర ఉంది? అనే అంశాలను పూర్తిస్థాయిలో బయటపెట్టాల్సిన అవసరం ఉంది. చిన్న చేపలను పట్టుకుని పెద్దవారిని వదిలేస్తారా? లేక తీగ లాగి డొంక కదిలిస్తారా..? అన్నది ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారుల విచారణపై ఆధారపడి ఉంది.

ముగ్గురితోనే ముగిస్తారా..? మూలాల్లోకి వెళ్తారా?

సీపీ దృష్టికి విషయం.. కదిలిన యంత్రాంగం

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో అవకతవకల వ్యవహారం పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం దృష్టికి వెళ్లడంతో సంబంధిత కేసుల వివరాలను తెప్పించి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఏఆర్‌ ఏసీపీ సి.ప్రతాప్‌ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రాథమికంగా అవకతవకల ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఒక ఆర్‌ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసి.. వీరిలో ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశామని, ఇద్దరిపై విచారణ కొనసాగుతోందని సీపీ వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం కేసు తీవ్రతను తెలియజేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement