కరీంనగర్‌కల్చరల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విషప్రచారం సరికాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం నగరంలోని ఓ హోట్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాళేశ్వరం ఎత్తిపోతల పంపులను వెంటనే ప్రారంభించి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. రిటైర్డ్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల సూచనలను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. ప్రస్తుతం భారీ మొత్తంలో నీరు సముద్రంలో కలిసిపోతోందని, రైతుల అవసరాలకు దానిని వినియోగించే చర్యలు చేపట్టాలని కోరారు. దూరదృష్టితోనే మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారని, దెబ్బతిన్న పిల్లర్ మరమ్మతుకు ఎల్‌అండ్‌టీ సంస్థ ముందుకు వచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. మరమ్మతులు పూర్తయితే రాజకీయంగా క్రెడిట్ దక్కదనే భావనతో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం వల్ల భద్రాచలానికి ముప్పు ఉందన్న సీఎం వ్యాఖ్యలను ఖండించారు. కాళేశ్వరం పంపులను తక్షణమే ప్రారంభించి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మేయర్ రవీందర్‌సింగ్, రఘువీర్‌సింగ్, ఓరుగంటి రమణారావు, ముత్యాల బలరాంరెడ్డి, ఏలేటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


