అంజన్న ప్రాశస్త్యంపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అంజన్న ప్రాశస్త్యంపై నిర్లక్ష్యం

Jul 13 2026 1:34 AM | Updated on Jul 13 2026 1:34 AM

అధ్వానంగా మునుల గుహకు వెళ్లే దారి

కొండల రాయుడి కోట వద్ద ప్రకృతి సోయగాలు

అస్తవ్యస్తంగా మునుల గుహకు వెళ్లే దారి

దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు

మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీకొండగట్టు ఆంజనేయస్వామిని మన రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు. ప్రతీ మంగళ, శనివారాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లిస్తారు.

మునుల గుహ.. కొండల రాయుడి కోట..

● కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లోని మునుల గుహ, కొండల రాయుడి కోటకు వెళ్లే దారులు మల, మూత్రాలు, చెత్తాచెదారంతో మూసుకుపోవడంతో చారిత్రక అంశాలు మరుగున పడుతున్నాయి. ఆలయ పరిసరాల్లో పర్యాటకులను ఆకర్షించేలా పెద్ద పెద్ద బండ రాళ్ల మధ్య మునుల గుహలో విశాలమైన స్థలం చూపరులను ఆకట్టుకుంటోంది.

● కొత్త కోనేరు సమీపంలో ఉన్న గుహలో మునులు తపస్సు చేసుకునేవారని, స్వామివారిని దర్శించుకునేందుకు మునులు వచ్చేవారని భక్తుల విశ్వాసం. మునుల గుహకు వెళ్లే దారి నిర్వహణను పట్టించుకోకపోవడంతో.. భక్తులకు మునుల గుహ ఉందనే విషయమే తెలియని పరిస్థితి నెలకొంది.

● బేతాళ స్వామి ఆలయానికి ఎదురుగా పెద్ద పెద్ద బండ రాళ్ల మధ్య కొండల రాయుడి కోట ఉండేదని, కొండల రాయుడు నిత్యం స్వామివారిని పూజిస్తూ మునులు, అడవి జంతువుల నుంచి భక్తులకు రక్షణ కల్పించేవాడని, నేటి బండ రాళ్లపై కొండల రాయుడి గుర్రం అడుగు గుర్తు ఉందని స్థల పురాణం చెబుతోంది. పర్యాటకులను ఆకట్టుకునేలా ఉన్న పెద్ద బండ రాళ్ల వద్ద ఇనుప చువ్వలతో బారికేడ్‌ ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొస్తే.. మరింతమంది పర్యాటకులను ఆకట్టుకునే అవకాశముంది.

ఎందుకీ వెనకడుగు..?

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించేందుకు అధికారులు చొరవ చూపడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకొని తిరుగు పయనమవుతున్నారు. నీతి అయోగ్‌ రూపొందించిన దర్శనీయ స్థలాల్లో ఒకటిగా స్థానం సంపాదించుకున్న కొండగట్టు ఆలయ ప్రాశస్త్యం తెలిపేందుకు అధికారులు అడుగు ముందుకు వేయడం లేదు.

కానరాని బోర్డులు

ఎత్తయిన వృక్షాలు.. వివిధ రకాల వన మూలికల చెట్లు.. పెద్ద పెద్ద బండ రాళ్లు.. ప్రకృతి సోయగాలు కొండగట్టుకొచ్చే భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కొండగట్టు ఆలయ పరిసరాల్లోని ఉప దేవాలయాలు, చారిత్రక నేపథ్యమున్న ప్రాంతాలను వివరించే బోర్డులు ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలానికి పైగా భక్తులు కోరుతున్నా.. అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు.

పడి ఉన్న అంజన్న విగ్రహం

ఆలయానికి ఉత్తర ద్వారం వైపు ఉన్న సులభ్‌ కాంపెక్స్‌ సమీపంలో సిమెంట్‌తో చేసిన ఆంజనేయస్వామి విగ్రహం పడి ఉండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో స్వామివారి విగ్రహం పడి ఉండడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement