వేములవాడ: దక్షిణ భారత సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన గాన కోకిల ఎస్.జానకి ఇక లేరనే వార్త సంగీతాభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో 2003లో జరిగిన త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల్లో ఆమె పాల్గొన్న క్షణాలను ఆదివారం వేములవాడ కళాకారులు గుర్తు చేసుకున్నారు. ఆ ఉత్సవాల్లో పాల్గొన్న జానకమ్మ తన మధుర గానంతో రాజన్న క్షేత్రాన్ని సంగీతమయంగా మార్చారు. ఆమె ఆలపించిన త్యాగరాజ కీర్తనలు భక్తులను పరవశింపజేయగా.. సంగీత ప్రియులు, స్థానిక కళాకారులకు స్ఫూర్తిగా నిలిచాయి. జానకమ్మ వంటి గాయని వేములవాడ వేదికపై గానం చేయడం అదృష్టంగా భావిస్తున్నారు. ఆమె స్వరం, సంగీతంపై ఉన్న అంకితభావం ఎప్పటికీ మరువలేమని ఇక్కడి కళాకారులు భావోద్వేగంగా చెప్పుకుంటున్నారు. జానకమ్మ భౌతికంగా దూరమైనా.. రాజన్న సన్నిధిలో ఆమె ఆలపించిన రాగాలు, భక్తి గీతాలు వేములవాడ సంగీతాభిమానుల హృదయాల్లో చిరకాలం మార్మోగుతూనే ఉంటాయని వారు నివాళి అర్పించారు. ఎస్.జానకి ఈనెల 11న కన్నుమూసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆమె మరణ వార్తతో దేశవ్యాప్తంగా సంగీతాభిమానులు, కళాకారులు నివాళి అర్పిస్తున్నారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో అనేక భాషల్లో దాదాపు 48వేల పాటలు ఆలపించి చెరగని ముద్ర వేశారు. వేములవాడ రాజన్న ఉత్సవాల ఇన్‌చార్జి రామయ్యశర్మ మాట్లాడుతూ.. 2003లో జానకి వేములవాడకు వచ్చారని, అప్పటి ఈవో కేశవులు, ట్రస్టు బోర్డు చైర్మన్ శికారి విశ్వనాథం చేతుల మీదుగా ఘనంగా సత్కరించినట్లు చెప్పారు.
త్యాగరాజ కీర్తనలతో అలరించిన జానకమ్మ
వేములవాడ వేదికపై ఆలపించిన ఆ స్వరం ఇక జ్ఞాపకాల్లోకి..
స్థానాచార్యుడి కుటుంబంతో అనుబంధం


